అనన్య న్యూస్, జడ్చర్ల: అర్హులైన పేదలకు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి అందిస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకానికి అర్హులైనా లబ్ధిదారులను ఎంపిక చేయడంలో భాగంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వాడ వాడలో పర్యటనలు చెప్పటారు. ఇందులో భాగంగా శనివారం పాతబజార్ 22వ వార్డులో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో కలసి ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ప్రాధమికంగా (39) మంది లబ్ధిదారులను గుర్తించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలనే ఉదేశ్యంతో తానే స్వయంగా ఇంటింటికి తిరుగుతూ అర్హులను గుర్తిస్తున్నట్టు తెలిపారు. పైరవీలకు తావు లేకుండా లక్షల విలువచేసే డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం అర్హులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరుగుతూ వారి యోగక్షేమాలను ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా పట్టణంలో మిగతా చోట్ల వివిధ నిర్మాణ దశల్లో 1400 డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా త్వరలోనే అర్హులకు అందజేయనున్నట్టు తెలిపారు. వీటిని కూడా తానే స్వయంగా పర్యటించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వెల్లడించారు