- మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు
- స్వరాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు
- త్వరలో ఇల్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
- రాజాపూర్ లో 56 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ
అనన్య న్యూస్, జడ్చర్ల: పనిచేసే ప్రభుత్వానికి అండగా ప్రజలు నిలవాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం రాజాపూర్ మండల పరిధిలో (56) మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామాల్లో పరిస్థితులు మారాయన్నారు. రోడ్లమీద మహిళలు బిందెలు పట్టుకొని బారులుదీరిన పరిస్థితులు నేడు లేవన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీరు అందిస్తున్నామన్నారు. వృద్ధులకు వికలాంగులకు ఒంటరి పింఛన్లు అందిస్తున్నామన్నారు.
వ్యవసాయానికి పెట్టుబడికి రైతులను దృష్టిలో ఉంచుకొని పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.10వేల రైతుబంధు కింద అందజేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్తు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. విత్తనాలు, సబ్సిడీ కింద ఎరువులు, వ్యవసాయ పరికరాలు అందజేస్తూ రైతు సంక్షేమ రాజ్యంగా నిలిచిందన్నారు. గతంలో లోవోల్టేజ్ వల్ల వ్యవసాయ మోటార్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా ప్రజలు ఒకసారి గమనించాలన్నారు. ఏ ప్రభుత్వం తమకు మేలు చేసిందో గ్రామాల్లో ప్రజలు చర్చ జరపాలని, పనిచేసే ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు.