అనన్య న్యూస్, మహబూబ్ నగర్: జడ్చర్ల సభలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గురువారం జడ్చర్లలో జరిగిన కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అనే విషయం మరిచి మాట్లాడుతున్నారని, అప్పట్లోనే పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పాలమూరును వలసలకు చిరునామాగా మార్చిన ఘనత కాంగ్రెస్ పాలకులదేనని, కేసీఆర్ సీఎం అయ్యాకే పాలమూరులో నిత్యం తాగునీరు వస్తుందని, వ్యవసాయానికి ఉచిత 24 గంటల కరెంటు వస్తుందన్నారు.
రైతులకు పంట పెట్టుబడి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు పథకం ఎందుకు లేదని అన్నారు. ఉమ్మడి జిల్లాలో 2014 ముందు కేవలం 30 హాస్టల్ లు మాత్రమే ఉంటే ఇప్పుడు ఏకంగా 140 గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వాన్నిదని, 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు 10 కోట్ల పింఛన్లు మాత్రమే ఇచ్చిందని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 106 కోట్లు ఇస్తుందని, పేదల పెళ్లిళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది శూన్యమని తెలంగాణ ప్రభుత్వం ఒక లక్ష 116 రూపాయలు అందిస్తుందన్నారు. కాంగ్రెస్ భూమి పూజ చేసి వదిలేసిన ప్రాజెక్టులను బిఆర్ఎస్ ప్రభుత్వం రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిందని, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కేవలం 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కేవలం 9 ఏళ్లలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత సీఎం కెసిఆర్ దని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా సుమారు 70 టీఎంసీలను నిల్వచేసే ఐదు అతి పెద్ద రిజర్వాయర్లను నిర్మాణం చేస్తున్నామన్నారు.
ఉమ్మడి జిల్లాలో సాగు, తాగు నీటిని అందించి వలసలని నిర్మూలించామని, పెద్ద ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు స్థానికంగా ఉపాధి అందించేలా ప్రయత్నిస్తున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో సేద తీరేందుకు పాలమూరులో చిన్న పార్కు కూడా లేనిది స్థితి ఉండేదని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సుందరమైన పార్కులను ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని రాజకీయంగా, సామాజికంగా ఎదగకుండా చేశారని ఆరోపించారు. ఉమ్మడి జిల్లా ఇప్పటికే ఎంతో అభివృద్ధి జరిగిందని ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.