అనన్య న్యూస్, హైదరాబాద్: దేశంలో రైతు సంఘటిత శక్తిని ఏకం చేద్దామని, తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదని, చిత్తశుద్ధితో పనిచేస్తే గెలిచి తీరుతామని సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జోషి ప్రణీత్ తో పాటు పలువురు రైతు నేతలు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందరభంగా వారందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్‌లో చేరిన మరాఠా రైతు సంఘం నేతలకు సాదర స్వాగతం. రైతుల పోరాటం న్యాయ బద్ధమైనది. నా 50 ఏండ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో అటుపోట్లు ఎదుర్కొన్నాను. తెలంగాణలో ఏం చేశామో మీరంతా ఒకసారి చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించండి అని కేసీఆర్ రైతు నేతలకు సూచించారు.
దేశ రాజధానిలో 13 నెలల పాటు రైతులు పోరాడారు అని కేసీఆర్ గుర్తు చేశారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులను ఉగ్రవాదులన్నారు. ఖలీస్తానీలన్నారు వేర్పాటు వాదులన్నారు. రైతుల పోరాటంతో మోదీ దిగివచ్చి క్షమాపణ చెప్పారు. 750 మంది రైతులు చనిపోతే ప్రధాని కనీసం స్పందించలేదు. మన దేశంలో దేనికి కొదవ లేదు. అయినప్పటికీ రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు రైతులు, చేనేతలు ఆత్మహత్యలు చేసుకునేవారు అని కేసీఆర్ గుర్తు చేశారు. వ్యవసాయాన్ని సుస్థిరం చేశాక రైతుల ఆత్మహత్యలు ఆగాయి. రైతుల గోస చూసి నాకు కన్నీళ్లు వచ్చేవి. దేశంలో 94 లక్షల ఎకరాల్లో వరి పండుతుంది. అందులో 56 లక్షల ఎకరాల వరి తెలంగాణలోనే పండుతుందని అన్నారు.