అనన్య న్యూస్, జడ్చర్ల: చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన గొప్ప వీరుడు పండుగల సాయన్న అని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాబిన్ హుడ్ పండుగల సాయన్న 134వ జయంతి పురస్కరించుకొని జడ్చర్ల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన పండుగల సాయన్న జయంతి వేడుకలలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హాజరై పండుగల సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనాటి నిరంకుశ నిజాం అధికారులను ప్రశ్నించి, వారిని ఎదిరించి తన సొంత పాలనా వ్యవస్థను స్థాపించుకొని, ఒక సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి కృషి చేసిన మహనీయుడు, ఆకలితో అలమటించే ప్రజల కోసం పోరాడి సాయం చేసిన వీరుడు అన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, నాయకులు పిట్టల మురళి, దోరేపల్లి రవీందర్, శివకుమార్, తెలుగు సత్తయ్య, మహిళా నాయకురాలు రేణుక, జడ్చర్ల ముదిరాజ్ సంఘం నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.