న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. ఈ ఏడాది మొదట్లో కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఢిల్లీలోని నితిన్ గడ్కరీ నివాసానికి ఫోన్ చేసి ఆయనను చంపేస్తామని బెదించారు. ఇప్పుడు కూడా గడ్కరీ ఢిల్లీ నివాసానికే బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి నితిన్ గడ్కరీని చంపేస్తామని బెదిరించారు.
దాంతో నితిన్ గడ్కరీ కార్యాలయ సిబ్బంది మంగళవారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెదిరింపు కాల్ చేసిన ఆగంతకులను గుర్తించేందుకు అన్ని కోణాల్లో ఎంక్వయిరీ చేస్తున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి చంపుతామని బెదిరించినట్లు తమ ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.