- దళితబంధు దేశవ్యాప్తంగా అమలు చేయాలి
- త్వరలో మరో విడత దళితబంధు.
- నియోజకవర్గానికి 1100 యూనిట్లు
- ఎస్సీ, ఎస్టీలకు వైన్ షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు
- ఎస్సీ, ఎస్టీలకు వ్యాపార అవకాశాలు అనే అంశంపై ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి అవగాహన సదస్సులో మంత్రి శ్రీనివాస్ గౌడ్
అనన్య న్యూస్, మహబూబ్ నగర్: అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం అవతరించిందని, రాష్ట్రం ఏర్పడటం వల్లే దళిత బహుజనులకు న్యాయం జరుగుతున్నదని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పేద దళితులను ఆదుకునేందుకు తెలంగాణలో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రంగంలో ఎస్సీ, ఎస్టీలకు వ్యాపార అవకాశాలు అనే అంశంపై స్థానిక సుదర్శన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బహుజనులకు తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. దళితుల కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు, టీ ప్రైడ్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుయన్నారు. ఎలాంటి బ్యాంకు లింకేజీ, లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10లక్షలు జమ చేసేలా ప్రవేశ పెట్టిన దళిత బంధు ఎంతో గొప్ప పథకమన్నారు. అంబేద్కర్ జీవించి ఉంటే తెలంగాణలో అణగారిన వర్గాల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఎంతో సంతోషించే వారని, దళిత బహుజనులు పేదలుగా కాకుండా అధికారం సాధించే దిశగా ఎదగాలన్నదే అంబేడ్కర్ ఆశయమన్నారు. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం దళిత సాధికారిత కోసం కృషి చేస్తోందన్నారు. సీఎం కేసీఅర్ దళితులు ఆర్థిక సాధికారతే ధ్యేయంగా దళిత బంధు ప్రవేశ పెట్టారని తెలిపారు. ఈసారి ప్రతి నియోజకవర్గానికి 1100 యూనిట్లు ఇచ్చేందుకు సీఎం నిర్ణయించారన్నారు. దళితబంధు పథకంలో గ్రూపు యూనిట్లను ఏర్పాటు చేసి విజయవంతం అయ్యేలా చేసినట్లు తెలిపారు. కారు, ట్రాక్టర్ డ్రైవర్లను ఓనర్లుగా చేశామన్నారు. దళిత, గిరిజనులను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడానికి డిక్కీ చేస్తున్న కృషి అమోఘనీయమని అన్నారు. డిక్కీకి నియోజకవర్గానికి ఓ కో-ఆర్డినేటర్ ను ఏర్పాటు చేసి దళితబంధు విజయవంతం అయ్యేందుకు సహకరించాలన్నారు.
సమైక్య రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారని మంత్రి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ లో డబుల్ బెడ్ రూం గృహాలు అత్యధికం ఎస్సీ, ఎస్టీలకే కేటాయించినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తెలంగాణ ఎక్సైజ్ పాలసీ విధానాన్ని మార్చేసి ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గానికి చెందిన వారికి వైన్ షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు కల్పించినట్లు వెల్లడించారు. దశలవారీగా గిరిజన, బీసీ, ఓసీ బంధు పథకాలు కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. మన దేశంలో ఉన్నట్లుగా ప్రపంచంలో మరెక్కడా కుల వ్యవస్థ లేదన్నారు. మహాత్మా జ్యోతిబాపూలే పరిశోథన ప్రకారం వృత్తుల నుంచే కులాలు ఏర్పడ్డాయని మంత్రి పేర్కొన్నారు. కుల రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలన్నారు. దళితులు ఆర్థికంగా ఎదిగితే కులవ్యవస్థ నిర్మూలన సాధ్యమన్నారు.
దళితబంధు పథకం ద్వారా దళితులకు తెలంగాణ ప్రభుత్వం రూ. 10 లక్షల ఉచిత ఆర్థిక సాయం అందిస్తోందని, సొంత తల్లితండ్రులు కూడా ఇంతటి సాయం చేయరని దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ… డిక్కీ జాతీయ అధ్యక్షుడు పద్మశ్రీ నర్రా రవికుమార్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దళితుల కోసం ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. దళితులపై తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న అభిమానానికి ఇవన్నీ నిదర్శనమన్నారు. సెక్రటేరియేట్ కు అంబేడ్కర్ పేరు పెట్టినందుకు, 149 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, డిక్కీ జాతీయ అధ్యక్షుడు పద్మశ్రీ నర్రా రవికుమార్, రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె. రవికుమార్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రణీల్ చందర్, కౌన్సిలర్ జాజిమొగ్గ నర్సింహులు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.