అనన్య న్యూస్, జడ్చర్ల: అంధత్వ రహిత తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారని, కంటి వెలుగు ను ప్రతి ఒక్కరు సద్వినియొగ పరుచుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం జడ్చర్ల మున్సిపాలిటీ 23వ వార్డు సూపర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కంటి పరిక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వమే ఉచితంగా అద్దాలు అందజేస్తుందని తెలిపారు. అవసరమైన వారికి వైద్యం, శస్త్ర చికిత్సలు ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తోందని అన్నారు.
కంటి వెలుగు శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పరిక్షలు నిర్వహించాలని వైద్యులకు సూచించారు. కంటి పరీక్షలు నిర్వహించుకున్న పలువురికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేతుల మీదుగా కంటి అద్దాలు అందచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కౌన్సిలర్లు పుష్పలత, ఉమా శంకర్ గౌడ్, రమేష్, నాయకులు రామ్మోహన్, పరమటయ్య, బృందం గోపాల్, నాయకురాలు రేణుక తదితరులు పాల్గొన్నారు.