- జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం..
- రేపటి తరాన్ని కాపాడుకుందాం..
అనన్య న్యూస్: ప్రకృతిలో మనం బాధ్యతగా ఉంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. మనిషికి మాత్రమే సొంతం అనుకుంటే, మిగిలిన జీవరాసులకూ సమాన హక్కు ఉన్న ప్రకృతిని మనిషి మాత్రమే వాడుకుంటే మనిషి మనుగడకే ప్రమాదం అవుతుంది. ప్రకృతిని ప్రేమిస్తూ.. పర్యావరణాన్ని రక్షిస్తూ.. ముందుకు సాగితే, ప్రకృతి మన భవిష్యత్ తరాలకు సాయం చేస్తుంది. ఇది మనందరికి తెలిసిన విషయమే అయిన మనం మాత్రం మాటలకే పరిమితం చేస్తున్నాం.
నేడు ప్రపంచ పర్యారణ దినోత్సవం సందర్భంగా.. పర్యావరణ పరిరక్షణ విషయాలు తెలుసుకుందాం.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతీ ఏడాది జూన్ 5వ తేదిన జరుపుకుంటున్నాం.
పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఐక్యరాజ్యసమితి ఈమేరకు పర్యవరణ దినోత్సవం జరపాలని నిర్ణయించింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) ద్వారా ఈరోజును జరుపుతున్నారు. 1972 జూన్ 5వ తేదీ నుంచి 16వ తేది వరకు మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశం అయింది. ఈ సందర్భంగా 1972 లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేసింది. 1974లో తొలిసారి ‘ఒకే ఒక్క భూమి’ థీమ్ తో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. 2019 సంవత్సరంలో ‘బీట్ ఎయిర్ పొల్యూషన్’ పేరుతో చైనాలో సదస్సు నిర్వహించారు. 2020లో ‘టైమ్ ఫర్ నేచర్.’ జర్మనీ సహకారంతో కొలంబియాలో నిర్వహించారు.
సాధారణ మానవుడు కూడా ఎలాంటి ఖర్చు లేకుండా పర్యావరణ పరిరక్షణ చేపట్టవచ్చు. మనం నివసించే ప్రదేశంలో చుట్టూ వుండే ప్రాంతములు, నివసించే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం మన కనీస బాధ్యతగా గుర్తించి మనము కొంత బాధ్యతా యుతంగా మెలగాలి. మనం చేసే పనుల వల్లనే అన్నీ కలుషితం జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని నివారంచటం మన చేతుల్లోనే ఉంది. మనం వాడే పరికరాల వలన మనం వదిలే కలుషిత గాలి వల్ల కూడా ఎంతో కాలుష్యం జరుగుతోంది. ఇదంతా కలగకుండా కాపాడాలి అంటే చెట్లను పెంచాలి.
మనం పీల్చే గాలి చెట్ల నుండి వస్తుంది. వాతావరణ కాలుష్యం వల్ల కొన్ని వందల జీవరాశులు అంతరించి పోతున్నయి. కాలుష్య నివారణకు ఇంటి దగ్గరే చెట్లు నాటడం, ఇంట్లో వుండే చెత్తను కాల్చకుండా చెత్త కుండీలో పడేయడం లేదా రోడ్డు ప్రక్కన పెట్టిన చెత్త కుండీలలో వేయడం, ప్లాస్టిక్స్ వాడకాన్ని తగ్గించండం, అందుకోసం మీరు ఏమైనా కొనాలి అనుకున్నప్పుడు మీతో పాటు ఒక సంచి తీసుకెళ్ళడం, ప్లాస్టిక్ బాటిల్స్ వాడకం తగ్గించండం, ఇంధనం వాడకాన్ని తగ్గించండం, చేరవలసిన గమ్యం దగ్గరే ఐతే నడచి వెళ్ళండం లాంటి వాటిని ఆచరించడం వల్ల పర్యావరణ పరిరక్షణలో మనం కూడా పాలుపంచుకున్నట్లే అవుతుంది.
మొక్కల్ని కాపాడాలి, చెట్లను పెంచాలి, అడవుల్ని అభివృద్ధి చెయ్యాలి అనుకుంటాం. తీరా చూస్తే… సంవత్సరం తిరిగేసరికి… మన ఇళ్ల చుట్టుపక్కల ఉండే ఎన్నోచెట్లు మాయమవుతాయి. ఆ స్థలంలో భవనాలు వచ్చేస్తాయి. ఇదే వాస్తవంలో జరుగుతున్నది. మనం చెప్పుకునేది ఒకటి… జరుగుతున్నది మరొకటి. అందుకే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మన ముందు తరాల వారిని కాపాడేందుకు మొక్కలను నాటుదాం, చెట్లను పెంచుదాం అప్పుడే మనం పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం..