అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మందు బాబులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ క్రమంలోనే బెల్ట్ షాపులను మొత్తంగా బంద్ చేయాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు వ్యూహాలను రచిస్తున్నారు. బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ నజర్ పెట్టింది. రాష్ట్రంలో బెల్ట్ షాపులను బంద్ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్లుగానే రాష్ట్రంలో బెల్ట్ షాపులను బంద్ చేయించేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో మొత్తం 2,620 వైన్స్‌లతో పాటు 1,800 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి.
ఈ వైన్ షాపులకు అనుబంధంగా గ్రామాల్లో లక్షకు పైగా బెల్ట్ షాపులు ఉన్నట్టు సమాచారం. తెలంగాణలో మొత్తం12 వేల 769 గ్రామపంచాయతీలు ఉండగా ఒక్కో గ్రామంలో 5 నుంచి 15 కి పైగా బెల్ట్ షాపులుండగా, రాష్ట్రంలో లక్షా 10 వేలకు పైగా బెల్ట్ షాపులు ఉన్నట్టు ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే బెల్ట్ షాపులను బంద్ చేయకుంటే వారిపై కేసులు పెట్టేలా ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. ఎక్సైజ్ శాఖకు సంవత్సరానికి సుమారుగా రూ.40 వేల కోట్ల ఆదాయం ఈ శాఖ ద్వారా వస్తుంది. అయితే ఈ బెల్టుషాపుల ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తున్నట్టుగా ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు.
ఈ బెల్ట్ షాపుల కారణంగా రోజంతా కష్టపడి పని చేసిన రైతులు, కూలీలు, పేద ప్రజలు తమ సొమ్మునంతా తాగుడుకే ఖర్చు చేస్తున్నారు. దాంతో పేదల బతుకులు చిద్రమైపోతున్నాయి. అందుకే ఎన్నికల్లో ప్రధాన హామీగా రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులను ఎత్తివేస్తామని పేర్కొంది కాంగ్రెస్. ఈ హామీ మేరకు బెల్ట్ షాపులపై చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. అదే సమయంలో వైన్ షాపుల విషయంలోనూ కఠిన నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఉన్న వైన్ షాపుల టైమ్ లిమిట్‌ను కుదించాలని భావిస్తోంది. త్వరలోనే ఈ నిర్ణయాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.