- ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ ఉద్యోగులు. వచ్చే అసెంబ్లీలోనే బిల్లు ఆమోదం. హైదరాబాద్ ప్రజారవాణాకు పెద్దపీట.
- పలు రూట్లలో మెట్రో విస్తరణ. తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయం..
అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ టీఎస్ ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అంగీకరించారు. విలీనానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేసేలా కమిటీ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. గతంలో 2019లో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సందర్భంగా వారి ప్రధాన డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఉండేది. అయితే, సంస్థను ఎట్టి పరిస్థితుల్లో నూ ప్రభుత్వంలో విలీనం చేయబోమని కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగులను అరచేతిలో పెట్టుకొని చూసుకుంటామని అప్పట్లో చెప్పారు.
తాజాగా టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేలా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విలీనం పూర్తి అయితే ఇకపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను కూడా పరిగణిస్తారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ మండలి సమావేశమైన సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశమై చర్చించింది. త్వరలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్ట నున్నది. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఆర్టీసీని కాపాడేందుకు, ప్రజారవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు, సేవలను ఇంకా విస్తృత పరిచేందుకు సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ విధివిధానాలు, నిబంధనలను రూపొందించేందుకు అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
గతంలో ఆర్టీసీ కార్మికులు ఈ విషయంలో సమ్మె చేయడం జరిగింది. వారి కోరికను మన్నిస్తూ.. అదేవిధంగా సామాజిక బాధ్యతగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ గా గుర్తిస్తూ అధికారులతో కూడిన సబ్ కమిటీ నీఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 43,373 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నది. సబ్ కమిటీలో అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్అండ్బీ, రవాణాశాఖ, జేఏడీ శాఖ కార్యదర్శులు, కార్మికశాఖ స్పెషల్ సెక్రెటరీ సభ్యులుగా ఉంటారు. పూర్తి నివేదికను వెంటనే సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. 3వ తేదీన ప్రారంభమయ్యే సమావేశంలోనే ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే పక్రియను ప్రారంభిస్తూ శాసనసభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనున్నది.
వెంటనే దానికి సంబంధిన కార్యాచరణ ప్రారంభించాలని రవాణాశాఖ, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రికి సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కేటీఆర్ తెలిపారు. ఇకపోతే హైదరాబాద్ భవిష్యత్తు అవసరాల నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రజా రవాణాను మరింత సులువు చేయడానికి నగరంలో చేపట్టాలని తలపెట్టిన కొత్త ప్రాజెక్టుల వివరాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేబినేట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రులతో కలసి మీడియాకు విరించారు.