అనన్య న్యూస్, హైదరాబాద్: నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యతన గురువారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర లభించింది. 111 జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. హెచ్ఎండీఏ పరిధి విధివిధానాలే జోవో 111 గ్రామాలకు వర్తిస్తాయని చెప్పారు. తెలంగాణలో 38 డీఎంహెచ్ వో పోస్టులు మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 33 జిల్లాలకు ఒక్కో చొప్పున అలాగే హైదరాబాద్ పరిధిలోని జోన్ల వారీగా ఆరు డీఎంహెచ్ వో పోస్టులు మంజూరు చేసింది. అలాగే కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో పీహెచ్ సీలు మంజూరుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది.కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డితో కలిసి హరీశ్‌రావు కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
తెలంగాణ కేబినెట్ ముఖ్య నిర్ణయాలు:
- గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలను కాళేశ్వరం ప్రాజెక్టులతో లింక్ చేయాలని నిర్ణయం.
- హుస్సేన్ సాగర్ ను కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో లింక్ చేయాలని నిర్ణయం.
- వ్యవసాయ రంగంలో మార్పుల కోసం వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ.
- కులవృత్తుల వారి అభివృద్ధి కోసం మంత్రి గంగుల ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ..ఒక్కో లబ్ధిదారుడు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించే విధంగా పథకం రూపకల్పన.
- నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం…నకిలీ విత్తనాలను సరఫరా చేసే వారిపై పీడీ యాక్టులు పెట్టాలని మంత్రవర్గం నిర్ణయం.
- 111 జీవో ను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం… హెచ్ఎండీఏ పరిధి విధివిధానాలే జోవో 111 గ్రామాలకు వర్తింపు.
- తెలంగాణలో 38 డీఎంహెచ్ వో పోస్టులు మంజూరు.
- కొత్తగా 40 మండలాల్లో పీహెచ్ సీలు మంజూరు.
- అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పర్మినెంట్ ఉద్యోగులను పెట్టాలని నిర్ణయం.
- జైన్ కమ్యూనిటీని మైనార్టీ కమిషన్ పరిధిలోకి తీసుకురావటం. ఆ వర్గానికి చెందినవారికి సభ్యుడిగా అవకాశం ..మొత్తం కమిషన్ లో 9 మంది సభ్యులు.
- తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బలోపేతం…కొత్తగా 10 పోస్టులు మంజూరుకు ఆమోదం.
- వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని కేబినెట్ నిర్ణయం…వివిధ విభాగాల్లో సర్దుబాటు.
- నాగర్ కర్నూల్ జిల్లాలో ఉమామహేశ్వర లిఫ్ట్ ఫేజ్ 1, ఫేజ్ 2ల ప్రాజెక్టు పనులకు ఆమోదం
- గొర్రెల పథకానికి సంబంధించి మరో 15 రోజుల్లో రెండవ విడత గొర్రెలు పంపిణీ చేయాలని నిర్ణయం.
- వనపర్తిలో జర్నలిస్టు భవనానికి పది గుంటల భూమిని మంజూరు చేస్తూ నిర్ణయం.
- ఖమ్మంలో జర్నలిస్టుల ఇండ్ల కోసం 23 ఎకరాల భూమిని మంజూరు చేస్తూ నిర్ణయం.
- రాష్ట్రంలో మక్కలు, జొన్నల కొనుగోలుకు కేబినెట్ నిర్ణయం.
- కర్నెతండాకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ను మంజూరు చేస్తూ నిర్ణయం.
- తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు నిర్వమించాలని నిర్ణయం..ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమం..