అనన్య న్యూస్, సూర్యాపేట: పంటలు ఎండి నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి రూ. 25 వేల నష్టపరిహారం అందించాలని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. జనగామ, సూర్యపేట జిల్లాలో కెసిఆర్ ఆదివారం పర్యటించి పలు ప్రాంతాల్లో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించాను. రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ఆదుకోవాలని రైలుతు డిమాండ్ చేస్తున్నారు. రైతుల కోసం మా ప్రభుత్వంలో చేయాల్సినవన్నీ చేశాం. వ్యవసాయంలో నెంబర్ వన్ గా ఎదిగిన తెలంగాణ మూడు నెలల్లోనే ఎలా దిగజారిపోయింది?. మా ప్రభుత్వంలో ఒక్క ఎకరం కూడా ఎండనివ్వలేదు. ఇప్పుడు సాగర్ కింద లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయి.
సూర్యాపేటలో 20వేల ఎకరాలు ఎండిపోయాయి. 100 రోజుల్లో 200మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.25వేలు ఇవ్వాల్సిందే అని అన్నారు. ప్రజలందరికీ మంచినీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో మేం పనిచేశామని మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు మళ్లీ బిందెలతో రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో ఒక్క వాటర్ ట్యాంక్ కూడా కనిపించ లేదన్నారు. రూ.35వేల కోట్లతో విద్యుత్ పాలసీ తీసుకొచ్చాం. 7వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని 18వేల మెగావాట్లకు పెంచాం. హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ సిటీగా తీర్చిదిద్దాం.8ఏళ్లు రెప్పపాటు కరెంట్ పోకుండా సరఫరా చేశాం. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ పోతే వార్త.. ఇప్పుడు కరెంట్ ఉంటే వార్త. 5600 మెగావాట్ల పవర్ ను ఉత్పత్తి చేసుకునే సౌకర్యం కల్పించామన్నారు