- పచ్చని కుటుంబాలను కాటేస్తున్న మద్యం..
అనన్య న్యూస్: పచ్చని కుటుంబాలను కాటేస్తున్న మద్యం. మద్యం మత్తు మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. మద్యానికి అలవాటు పడి కొందరు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మద్యానికి బానిసలై అనారోగ్యం పాలై అర్ధాంతరంగా ఆయువు తీసుకుంటున్నారు. దాంతో వారి కుటుంబాలు ఆగమైతున్నాయి. మరికొందరు మద్యం మత్తులో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాగుడు వ్యసనానికి ఎందరో బలవుతూనే ఉన్నారు. మద్యం ఊబిలో చిక్కి తాము మునిగి చస్తూ.. కుటుంబాలను ఆగం చేస్తున్నారు. మద్యం దాటికి చెల్లా చెదరవుతున్న జీవితాలు, అమ్మేవారు లాభం చూసుకుంటున్నారు. మరి తాగేటోళ్లు వారి ప్రాణం కోసం ఎందుకు ఆలోచించరు..
ఎన్నో కుటుంబాలకు శాపంగా మారుతున్న మద్యం. తాగుడుకు బానిసైన తమ భర్తలు, తండ్రులు, అన్న దమ్ములను మార్చు కోలేక పోయినా మహిళలు. కళ్ళముందే ఇంట్లో వారు తాగుడుకు బానిసై ఏం చేయలేక మహిళలు కన్నీరు మున్నీరవ్వడం తప్ప ఏమి చేయలేకపోతున్నారు. యువకులు తెలిసి తెలియని వయసులో సరదాగా అలవాటైన మద్యం వారిని బానిసలుగా మార్చేస్తోంది. మద్యం తాగే వారిలో ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు తలెత్తుతాయి. మద్యం మత్తును వదులుకోకపోతే వారి బతుకులు అధోగతిపాలె, వారి చేజేతులా అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడం తో పాటు తమ శరీరాన్ని అత్యంత వేగవంతంగా గుల్ల చేసుకోవడమే తప్ప మరేమీ కాదు.
ఏది ఏమైనా మద్యపానం సేవించడం మన పాలిట ఓ పెనుభూతం, ఈ తాగుడు అనే వినాశకర అలవాటును ఆమడ దూరంలో ఉంచగలిగితే వారి ఆరోగ్యం పది కాలాల పాటు వర్థిల్లుతుంది. లేకపొతే ఆస్పత్రి బారిన పడి అటు ఆర్థికంగా, ఇటు ఆరోగ్యపరంగా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే వివేకంతో అలోచించి మద్యపానం అనే దురలవాటుకు స్వస్తి చెప్పాలి. అప్పుడే తమ జీవితాలను బాగుచేసుకోవటంతో పాటు, తమను నమ్ముకున్న కుటుంబ సభ్యులను సైతం రక్షించిన వారవుతారు.
తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం:
ఇంట్లో తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల పర్యవేక్షణ పిల్లలపై లేకపోవడం వల్ల స్నేహితులతో కలిసి సరదాలు తీర్చుకుంటున్నారు. పుట్టిన రోజులు, పరీక్షలు పాసైనప్పుడు తదితర సందర్భాల్లో మద్యానికి అలవాటు పడుతున్నారు. ఎంజాయ్ ముసుగులో చెడు అలవాట్లకు బానిసై చివరకు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, మంచి చెడూ చెప్పేవారు లేక ఈ పోకడలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. పెళ్లై పిల్లలున్నవారు కుటుంబ బాధ్యతలు మరిచి ఇష్టారాజ్యంగా తాగుతూ ఆరోగ్యం చెడగొట్టుకుని అర్ధాంతరంగా తనువు చాలించి అయినవారిని అగాధంలోకి నెడుతున్నారు.
విచ్చలవిడి అమ్మకాలు:
ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్, రెస్టారెంట్లతోపాటు బెల్టు దుకాణాల్లో మద్యం విరివిగా లభిస్తోంది. సరాదాగా అలవాటైన మందు మార్కెట్లో మరింత సులువుగా లభ్యం అవుతుండటంతో యువత బానిసలుగా మారుతున్నారు. చదుకోవాల్సిన వయసులో పిల్లలు మద్యం, మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారు. దుకాణాల్లో మైనర్లకు విక్రయించకూడదనే నిబంధన పలుచోట్ల అమలుకు నోచుకోవడం లేదు. విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.
అవగాహన అవసరం:
మద్యం, మత్తు పదార్థాల వల్ల సంభవించే దుష్ఫలితాలపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాలని, పాఠశాలలు, కళాశాలల్లో తరచూ ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించాలని వైద్య నిపుణలు పేర్కొంటున్నారు. విద్యా సంస్థల వద్ద బోర్డుల ఏర్పాటుకే అవగాహన పరిమితమైంది. మద్యానికి అలవాటు పడిన వారికి కౌన్సెలింగ్ అవసరమని, మత్తుకు అలవాటుపడిన వారిని సకాలంలో గుర్తించి కౌన్సిలింగ్ ఇప్పించ గలిగితే ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు..