- తొలకరి ఆలస్యంతో రైతుల్లో ఆందోళన.
- ఆలస్యమవుతున్న నైరుతి ఋతుపవనాలు.
- రైతుల చూపు.. వరుణుడి వైపు..
అనన్య న్యూస్: ప్రస్తుత వాతావరణం చూస్తుంటే ఇంకా ఎండాకాలం కొనసాగుతున్నట్లుగా ఉంది. వర్షాలు ముఖం చాటేయడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. తొలకరి రాక ఆలస్యం కావడంతో ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలు వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. కొన్నిచోట్ల పత్తి నాటుకున్నారు. దీంతో ఆ రైతుల్లో ఆందోళన తీవ్రం అవుతోంది. గత వారంరోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మండుటెండలు, వడగాల్పులు చూస్తుంటే మరో వారం దాకా తొలకరి చిలకరించే పరిస్థితి కానరావడం లేదు.
ఆలస్యంగా నైరుతి: ఇప్పటికే నైరుతి ఆలస్యంగా వచ్చింది. దీంతో సాగు భూములకు నీరు లేక నెర్రెలు బారుతున్నాయి. తొలకరి వర్షాలతో విత్తనాలు మొలకెత్తాల్సిన సమయమిది. వర్షాలు లేకపోవడం వల్ల మొలిచిన మొక్కలు ఒక పక్క ఎండుతుండగా, మరో పక్క సాగు భూములు నెర్రులు పడుతున్నాయని రైతులు వాపోతున్నారు. కనీసం ఒక్క చినుకైనా కురియకపోతే విత్తులు మురిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మృగశిర కార్తె ప్రారంభంలోనే వర్షాలు కురవడం ఆనవాయితీ. అప్పుడే విత్తనాలు వేస్తారు. ఓ వైపు వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నా వినలేదు. దుక్కులు దున్ని చాలా మంది రైతులు విత్తనాలు నాటుకునేందుకు సమాయత్తం అవుతున్నా తరుణంలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆకాశం వైపు ఆందోళనతో చూస్తున్నారు. ఇక మొలచిన మొక్కలను బతికించుకొనేందుకు రైతులు పడుతున్న బాధలు వర్ణణాతీతం. వర్షాధారంపైనే ఆధారపడిన రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
ఖరీఫ్ ప్రారంభంలోనే కష్టాలు: ఖరీఫ్ ప్రారంభంలోనే అన్నదాతలకు కష్టాలు వెంటాడుతుండటంతో రైతులు దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చాలాచోట్ల ఎక్కువ మంది రైతులు వాణిజ్య పంట అయిన పత్తి పంటనే సాగు చేస్తారు. వర్షాకాలం ప్రారంభంలోనే రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి ఖరీఫ్కు సిద్ధమయ్యారు. ఈసారి వర్షాలు ఆలస్యం కావడంతో ఎప్పుడు పడతాయోనని వాపోతున్నారు.