న్యూఢిల్లీ: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన దేశానికే సిగ్గుచేటన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఎవరినీ వదిలిపెట్టబోమని తెలిపారు. గురువారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని మణిపూర్‌లో జరిగిన అమానవీయ ఘటనపై స్పందించారు.
మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై జరిగిన అమానవీయ ఘటన నాహృదయాన్ని తీవ్రంగా కలచివేసిందనీ, ఈ ఘటన 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుపడేలా చేసిందన్నారు. ఆ మణిపూర్ కుమార్తెలకు జరిగిన అన్యాయాన్ని ఎన్నటికీ క్షమించలేంమని, మహిళల భద్రత విషయంలో రాజీ పడబోంమని, నిందితులను విడిచిపెట్టబోమని దేశ ప్రజలకు భరోసా ఇస్తున్నానని అన్నారు. ఈ ఘటనపై రాజకీయాలకు అతీతంగా స్పందించాలి. నిందితులను శిక్షించేందుకు చట్టం పూర్తిశక్తితో పని చేస్తుందని ప్రధాని అన్నారు.