- పాలమూరు అభివృద్ధిపై చర్చకు సిద్ధం: రేవంత్ రెడ్డి.
- అధికారంలోకి రాగానే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తాం
- పీపుల్ మార్చ్ పాదయాత్ర లాంగ్ మార్చ్ లాంటిది: సీఎల్పీ నేత భట్టి.
అనన్య న్యూస్, జడ్చర్ల: పాలమూరులో వలసలు ఆగలేదని, పంటలు పండడం లేదని, ఆత్మహత్యలు ఆగడం లేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్ మార్చ్ పాదయాత్రలో భాగంగా గురువారం జడ్చర్లలో జరిగిన బహిరంగ సభలో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్ రావు ఠాక్రేతో కలిసి హాజరై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రసంగించారు. పాలమూరు బిడ్డనైన నన్ను కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ టీపీసీసీ చీఫ్‌గా తనకు అవకాశం ఇచ్చిందని రేవంత్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఈ జిల్లాలో ఉన్న 14 అసెంబ్లి, 2 పార్లమెంట్ సీట్లను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చినా పాలమూరులో వలసలు ఆగలేదన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని నిధులన్ని గజ్వేలు, సిద్ధిపేట, సిరిసిల్లకే పోతున్నాయన్నారు. కేసీఆర్ పాలమూరుకు వస్తే ఎంపీగా గెలిపించి రాజకీయ భవిష్యత్తును అందించామని అన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు కుల వృత్తులు చేసుకోవాలని అంటున్న కేసీఆర్ ఆయన కుటుంబం మాత్రం అధికారం అనుభవించాలా? అని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిన వారి ఓట్లు, కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఓట్లతో పోల్చుకుంటే లక్ష్మారెడ్డికి డిపాజిట్ కూడా రాదన్నారు. డిపాజిట్ వస్తే అంబేద్కర్ సాక్షిగా చెబుతున్న ముక్కు నేలకు రాస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, రూ. 500 లకే సిలిండర్ ఇస్తామని, భూముల సమస్యలు లేకుండా చేస్తామని వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన అభివృద్ధి పై చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పిల్లల మరి నుంచి ప్రాజెక్టుల దాకా అంబేద్కర్ సాక్షిగా ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 ఎంపీ స్థానాలను గెలిపించి తనను ఆశీర్వదించాలని కోరారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలన ఎండగట్టడం కోసం యావత్ తెలంగాణ ప్రజలకు మద్దతుగా అదిలాబాద్ జిల్లా పిప్పిరి నుంచి ప్రస్తుత పాలమూరు జిల్లా జడ్చర్ల వరకు నా పాద యాత్ర 800 కిలోమీటర్ల వరకు చేరుకుం దన్నారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రను ఆదర్శంగా తీసుకుని నేను యాత్రను కొనసాగిస్తున్నానని, రాహుల్ ఇచ్చిన సందేశాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లుతున్నట్లు భట్టి తెలిపారు. రాహుల్ గాంధీని అప్రజాస్వామికంగా జైలు శిక్ష విధించడంతో పాటు- పార్లమెంటు- సభ్యత్వాన్ని రద్దు చేయడం దుర్మార్గమన్నారు. బీజేపీ సర్కార్ తీరును నిరసిస్తూ కర్ణాటక ప్రజలు.. అక్కడి నుంచి తరిమి కొట్టారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం కుటుంబ పాలన చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో 24 లక్షల ఎకరాలను పేదలకు ఇస్తే ఈ ప్రభుత్వం వాటిని లాక్కోంటదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తిరిగి వారికే ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను నిరుపేద రైతుల దగ్గర లాక్కోవడం దౌర్భాగ్య పాలనకు నిదర్శనమని , ధరణి పోర్టల్‌ను బంగాళా ఖాతంలో కలిపేస్తామని ఆయన హెచ్చరించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రజల కోసమేనని, ప్రజల హక్కులను, ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకే నా పాదయాత్ర అన్నారు. పాదయాత్రలో భాగంగా అదిలాబాద్ జిల్లా ఉట్కూరు మండలం దేవగూడలో అక్కడి పోడు భూముల రైతుల గోడు దు:ఖాన్ని కలిగేలా చేసిందని, సింగరేణి బొగ్గు గనులు ప్రైవేట్ పరం చేయడం, నిరుద్యోగుల బాధలు వర్ణనాతీతమన్నారు. రాబోయే ఎన్నికల్లో కర్ణాటక ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలోనూ ఉంటాయని, బీఆర్‌ఎస్ అవినీతి పాలనపై ప్రజలు విసిగిపోయారని ఆయన తెలిపారు. ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు గ్యాస్ సిలిండర్ రూ. 500లకే ఇస్తామన్నారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి బీడు భూములకు నీళ్లు ఇస్తామన్నారు.
కాంగ్రెస్ వల్లే తెలంగాణ కల సాకారం: హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు
తెెలంగాణ ప్రజల ఆకాంక్షను తలంగాణ ప్రజల ఆకాంక్షను, కలను కాంగ్రెస్ పార్టీ నేరవేర్చిందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌సింగ్ సుక్కు అన్నారు. డెబ్బై ఏళ్ల స్వరాష్ట్ర సాధన పోరాటంలో దాదాపుగా 15 వందల మంది ప్రజలు, యువకులు ఆత్మహత్యలు చేసుకుకుంటే.. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ చలించిపోయి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను అధిష్టానానికి విన్నవించుకుంటే.. ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని, మరే పార్టీ వల్ల కాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ సభకు హాజరయ్యే ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తనకు ఫోన్ చేశారని, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మేలును చేయాలని చెప్పారన్నారు. తెలంగాణ ఇస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్నదని ఆయన గుర్తు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నేరవేర్చిందని తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పడి తొమ్మిది ఏళ్లు గడిచినా కూడా ఇక్కడి ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాల వంటి హామీలను ఇంకా నెరవేరలేదని ఆయన విమర్శించారు. వచ్చే ఐదారు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి అంశాన్ని ప్రశ్నించాలని ఆయన కోరారు.
తమ రాష్ట్రంలో ఉద్యోగులకు, అధికారులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ వారికి అండగా ఉంటున్నామని వివరించారు. నాడు దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన సమయంలో 40 కోట్ల జనాభా ఉండగా, ఇపప్‌డు 140 కోట్ల జనాభాకు చేరిందన్నారు. నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం హాయాంలో దేశంలో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ అందరి మదిలో నిలిచిందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి అన్ని రకాల అభివృద్ధి ఫలాలను ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా పొందాలని ఆకాంక్షించారు.
బహిరంగ సభలో నేతలు రాష్ట్ర ఇంచార్జ్ ఠాక్రే, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, డిసిసి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, నాగార్జున రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్ కుమార్, వెంకట్, వి. హనుమంత్ రావు, రాములు నాయక్, వంశీచందర్ రెడ్డి, శివసేన రెడ్డి లతోపాటు భారీ ఎత్తున రాష్ట్ర, ఉమ్మడి జిల్లా, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.