- నవాబుపేటలో పండుగల సాయన్న జయంతిలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
అనన్య న్యూస్, నవాబుపేట: పేద ప్రజల కోసం ఆధిపత్య వర్గాలపై యుద్ధం చేసిన వీరుడు, పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచిన ప్రజా వీరుడు పండుగల సాయన్న అని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. నవాబుపేట మండలంలో శనివారం నిర్వహించిన పండుగల సాయన్న జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పండుగల సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పండుగల సాయన్న ఒక ప్రాంతానికి పరిమితం కాదని, ఆనాటి బహుజనులలో ఉన్న పేదల కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. బడుగు వర్గాల వారందరికీ అన్నం పెట్టిన మహనీయుడన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే బడుగు, బలహీనవర్గాల కోసం కృషి చేసిన మహనీయుల చరిత్రలు బయటకు వస్తున్నాయని, స్వరాష్ట్రంలోనే బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు.
కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, పండుగల సాయన్న అభిమానులు తదితరులు పాల్గొన్నారు.