- మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: జిల్లా కలెక్టర్..
అనన్య న్యూస్, మహబూబ్ నగర్: మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.విజయేందిర బోయి అన్నారు. మత్తు, మాదక ద్రవ్యాల వినియోగంతో జీవితం నాశనం చేసుకోవద్దని, యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా దూరంగా ఉండాలని అన్నారు. బుధవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్టేడియం గ్రౌండ్ నుండి తెలంగాణా కూడలి వరకు జిల్లా కలెక్టర్ బి. విజయేందిర బోయి, జిల్లా ఎస్పీడి. జానకిల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ కూడలి నందు మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నట్లు, పిల్లలు, యువత లక్ష్యం చేసుకొని మాదక ద్రవ్యాల సరపరా జరుగుతుందని అన్నారు. మాదక ద్రవ్యాల బారిన పడి యువత తమ జీవితాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. ముఖ్యంగా విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాలు సరఫరా, వినియోగంపై పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. పోలీస్ శాఖ మాదక ద్రవ్యాల వినియోగం రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.
జిల్లా ఎస్పీ డి. జానకి మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం రవాణా ప్రమాదకరంగా పరిణమిస్తున్న నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ నిఘా విస్తృతం చేసింది, మాదకద్రవ్యాల నిరోధించడానికి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తామని, మాదకద్రవ్యాల రవాణాలో ఎంతటివారున్న ఉపేక్షించబోమని అన్నారు, ముఖ్యంగా యువత మాదకద్రవ్యాల జోలికి పోకుండా సరైన నిర్ణయాలు తీసుకోని వారి జీవితాలను సక్రమమైన మార్గంలో ముందుకు వెళ్లాలని, మీరందరి భవిష్యత్తు చక్కగా ఉండాలని, చక్కగా చదువుకొని ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్న మీ తల్లిదండ్రుల ఆశలు ఆశయాలకు అనుగుణంగా జీవితంలో ముందుకు వెళ్లాలని ఒక్కసారి ఈ మాదకద్రవ్యాల బారిన పడి టేస్ట్ చూద్దామని అనుకున్నారంటే ఒక్కసారి తో ఆగిపోకుండా అనేకసార్లు తీసుకొనడం వలన మీ ఆరోగ్యము క్షీణించడమే కాకుండా మీపై క్రిమినల్ కేసులు కూడా అవుతాయి అట్టి కేసులలో కూడా 10 సంవత్సరాలు లేక జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉండడం వల్ల, మీ యొక్క జీవితం మొత్తం జైల్లో ఉండి శిక్షను అనుభవించవలసి వస్తుంది. అందుకనే యువత ఎవరు కూడా తమ జీవితాన్ని ఈ మాదకద్రవ్యాల బారిన పడకుండా చూసుకోగలరని, గంజాయి అమ్ముతున్నట్లు ఎలాంటి సమాచారం ఉన్న డయల్ 100 కి గానీ, జిల్లా కంట్రోల్ రూం నెంబర్ 8712659360 గానీ, మీదగ్గరలోని పోలీసు స్టేషన్ కి సమాచారం ఇవ్వగలరని, డ్రగ్స్ కంట్రోల్ చేయడం పోలీసులు మాత్రమే కాకుండా ప్రజలతోపాటు ఇతర విభాగాల సహకారం కూడా ఉండాలని అన్నారు. కలిసికట్టుగా డ్రగ్స్ పై యుద్ధం చేస్తే డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చూడొచ్చని తెలిపారు.
అనంతరం జిల్లా పోలీసుల తరపున మాదకద్రవ్యాల నివారణ మరియు రవాణా పై వ్యాసరచన మరియు ఉపన్యాసం పోటీలు నిర్వహించగా, జిల్లా పరిషత్ కార్యాలయంలో హాల్ నందు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రదానోత్సవం జిల్లా ఎస్పీ డి. జానకి అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ భాస్కర్ రెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిని జరినా బేగం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.