అనన్య న్యూస్, మహబూబ్ నగర్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మాసైపోతావని బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మహబూబ్ నగర్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షోలో మాట్లాడారు. కారు షెడ్డు నుంచి బయటకు రాదని పాడైపోయిందన్నారు. పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా అని ప్రశ్నించారు. పార్లమెంటులో నిద్రపోవడానికి బీఆర్ఎస్‌కు ఓటు వేయాలా అంటూ ప్రశ్నలు సంధించారు.
పాలమూరుకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. 2009లో కేసీఆర్‌ను కరీంనగర్ ప్రజలు తరిమికొట్టారని, అక్కడి నుంచి పాలమూరుకు వచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చాక పాలమూరుకు కేసీఆర్ చేసిందేంటని సూటిగా ప్రశ్నించారు. పదేళ్లు కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ప్రశ్నించారు. ఢిల్లీలో మోడీ, గల్లీలో కేసీఆర్ పాలనను చూశామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని, తమను ఓడించేందుకు ప్లాన్ చేస్తున్నాయని ఆరోపించారు. లక్ష మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.