అనన్య న్యూస్, మహబూబ్ నగర్: భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ ఒకటేనని వారి మాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం సూచించారు. బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం కెసిఆర్ మహబూబ్ నగర్ లో రోడ్డుషో నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికలలో మూడు పార్టీలు పోటీలో ఉన్నాయని, వీటిలో ఏ పార్టీ ప్రజలకు మేలు చేస్తుందో ఆలోచించాలని అన్నారు. బీజేపీ ఈ పదేండ్లలో మనకేమన్నా మేలు చేసిందా? మోడీ వంద నినాదాలు చెప్పిండు. ఒక్కటన్న నిజమైందా? సబ్ కా వికాస్ అన్నడు. కానీ, సత్యనాశ్ చేసిండు. అచ్చే దిన్ వచ్చిందా? సచ్చేదిన్ వచ్చిందా? 15 లక్షలు బ్యాంకులకు వస్తాయన్నాడు వచ్చి నయా?” అని కేసీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏమీ చేయని నరేంద్ర మోడీ విశ్వగురువు ఎట్లాయేనని ఎద్దేవా చేశారు. వంద ఉత్తరాలు రాసినా పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. లక్షలాది ఉద్యోగాలు ఖాళీ ఉన్నా నింపలేదన్నారు. నల్ల చట్టాలు తెచ్చి వందలాది రైతుల మరణాలకు కారణ మైండు. తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదు. ఈడ ఛోటే భాయికి ఓటేసినా, ఆడ బడే భాయికి ఓటేసినా ఒకటే అంటూ కేసీఆర్ విమర్శించారు. బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టమన్నారు. ఆంధ్రాకు నీళ్లు మలుపుక పొమ్మని హారతులు పట్టిన డీకే అరుణకు ఓటెందుకెయ్యాలో చెప్పాలన్నారు.
అన్నమాటలు మంట్ల గలిపిండ్రు:
మాకు ఓటేస్తే నిమిషాల మీద యిదిస్తాం, అదిస్తాం అన్నది కాంగ్రెస్ పార్టీ ఐదు నెలలు కావస్తోంది. రైతుబంధు వచ్చిందా? రుణమాఫీ అయ్యిందా? పంటలకు బోనస్ వచ్చిందా? స్కూటీ ఇయ్యలేదు గానీ లూటీ అయితే నడు స్తోంది. తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చిండ్రా? ఆసరా పింఛను పెంచిండ్రా? ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు. ఓవర్సీస్ స్కాలర్ షిప్ ఎక్కడబోయింది?’ అంటూ కేసీఆర్ మండిపడ్డారు. ప్రతి స్కీమ్ లో మోసం, దగా చేస్తున్నారని, కండ్ల ముందే తెలంగాణను ఆగం చేస్తానంటే కేసీఆర్ యుద్ధం చేస్తాడు తప్ప నిద్రబోడని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని, గెలిపిం చాలని విజ్ఞప్తి చేశారు. సీఎం స్థాయిలో ఉండి రేవంత్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ తెచ్చిన నన్ను అట్లా అనుడు మర్యాదేనా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని గెలి పించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సి. లక్ష్మారెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.