అనన్య న్యూస్, మహబూబ్ నగర్: రహదారులపై ప్రమాదాలు జరగకుండా చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా ఎస్పీ కే. నరసింహ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని, అందువల్ల వీటిని తగ్గించేందుకు ఇదివరకే రూపొందించిన ప్రణాళికను పక్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
రహదారి పనులు జరిగే చోట, అదేవిధంగా చౌరస్తాలు, డివైడర్లు, సరైన విధంగా వెలుతురు లేని చోట్ల,మానవ తప్పిదాల మూలంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ఇలాంటివి సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులతోపాటు, జాతీయ రహదారుల సంస్థ, ట్రాన్స్ పోర్ట్ అధికారులు, అదేవిధంగా అన్ని శాఖలు సహకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. మహబూబ్ నగర్, జడ్చర్ల వంటి పట్టణాలలో సెంట్రల్ మీడియన్ల వద్ద రహదారులు దాటేటప్పుడు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని వీటన్నింటిని తగ్గించేందుకు ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకుగాను కళాజాత బృందం ద్వారా అన్ని కళాశాలలు, పాఠశాలలతో పాటు, రద్దీ ప్రదేశాలలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అన్నారు.
జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా జిల్లా యంత్రాంగానికి తమ వంతు అవసరమైన సహకారాన్ని అందిస్తామని, అదే విధంగా ప్రమాదాల నివారణలో భాగంగా అవసరమైన ఏర్పాట్లను చేస్తామని తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు, డి ఆర్ బి డి.ఎస్.పి వెంకట రమణా రెడ్డి, ఆర్టీవో దుర్గా ప్రమీల, ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి, జాతీయ రహదారుల సంస్థ ఇంజనీర్ రమేష్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, మహమద్ షేక్, ఆర్ అండ్ బి ఈ ఈ స్వామి తదితరులు హాజరయ్యారు.