- జనసాంధ్రత తక్కువగా ఉండటమే కారణం..
- స్పష్టం చేసిన అధికారుల అధ్యయనం..
- తన వంతు ప్రయత్నం తాను చేసానన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి..
అనన్య న్యూస్, జడ్చర్ల, డిసెంబర్ 19: నిబంధనలమేరకు నిర్ణీత ప్రమాణంలో జనాభా లేని కారణంగా బాలానగర్ ను మున్సిపాలిటీగా చేయడం సాధ్యంకాదని అధికారులు తేల్చారు. కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడానికి ఒక చదరపు కిలో మీటర్ పరిధిలో కనీసం 1000 మంది జనాభా ఉండాల్సి ఉండగా బాలానగర్ లో మున్సిపాలిటీగా చేయడానికి ప్రతిపాదించిన ప్రాంతమంతా కలిపి కేవలం 278 జనాభా మాత్రమే ఉందని తెలిపారు.
జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బాలానగర్ మండల కేంద్రంతో పాటుగా సమీప గ్రామాలైన నందారం, గుండేడ్, గౌతాపూర్, పెద్దాయిపల్లి గ్రామాలను కలిపి బాలానగర్ మున్సిపాలిటీ చేయాలంటూ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. దీంతో బాలానగర్ మున్సిపాల్టీ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా సీఎం అధికారులను కోరారు. ఈ నేపథ్యంలోనే బాలానగర్ మున్సిపాల్టీ ఏర్పాటును గురించి సంబంధిత అధికారులు అధ్యయనం చేసారు. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు ఇతర అనేక అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నా ముఖ్యంగా జనసాంధ్రత ప్రధానమైన అంశమని అధికారులు అభిప్రాయపడ్డారు.
నిబంధనల మేరకు కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలంటే చదరపు కిలో మీటరుకు కనీసం 1000 మంది జనాభా ఉండాలని చెప్పారు. బాలానగర్ మండల కేంద్రంతో పాటుగా సమీప గ్రామాలైన నందారం, గుండేడ్, గౌతాపూర్, పెద్దాయిపల్లి గ్రామాలన్నీ కలిపి మొత్తం 30.45 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉండగా నిబంధనల ప్రకారంగా ఇక్కడ కొత్త మున్సిపాలిటీ చేయాలంటే వీటి జనాభా 30 వేలకు పైబడి ఉండాలి. కానీ ఈ అన్ని గ్రామాల జనాభా కలిపి మొత్తం 8472 మంది మాత్రమే ఉన్నారని, ఈ లెక్కన జన సాంధ్రత చ.కిలో మీటర్ కు 278 మాత్రమే ఉందని తేల్చారు.
జనాభా సాంధ్రత తక్కువగా ఉన్నా ఒకవేళ బాలానగర్ తాలూకా హెడ్ క్వార్టర్ అయిన మున్సిపాలిటీ చేయడానికి అవకాశం ఉండేదని చెప్పారు. జానాభా తక్కువగా ఉండటం, తాలూకా కేంద్రం కాకపోవడంతో బాలానగర్ మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం ఇప్పట్లో సాధ్యం కాదని స్పష్టం చేసారు. కాగా మున్సిపాలిటీగా చేస్తే బాలానగర్ మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందనే ఉద్దేవ్యంతోనే మున్సిపాలిటీ చేయాలని ప్రతిపాదించామని, అయితే తన వంతుగా తాను ప్రయత్నం చేసినా తక్కువ జనాభా ఉన్న కారణంగా అది సాధ్యం కావడం లేదని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు .