అనన్య న్యూస్:మహబూబ్ నగర్ అభివృద్ధిపై సమైక్య పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదని అందుకే స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక అనేక మంది పొట్టచేత పట్టుకొని ముంబై వలసలు వెళ్లే వారిని వలసలు వెళ్లిన వారంతా తిరిగి ఇప్పుడు వచ్చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అప్పుడు బతుకుదెరువు అంటే ముంబై వలసలు ఇప్పుడు మాత్రం బతుకుతెరువుకు మహబూబ్ నగర్ కేరాఫ్ అడ్రస్ గా మారిందని అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శ్రీ బాలాజీ టైల్స్ అండ్ గ్రనైట్స్ వర్కర్స్ ఆధ్వర్యంలో ముంబై, పూణే నగరాలకు వలస వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ తిరిగి సొంత గ్రామాలకు తిరిగి వచ్చిన సుమారు 300 మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లాను మరింతగా వెనుకబడేలా చేశారని ఇక్కడి ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని అన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక ముంబై, పుణె వంటి దూర వలస వెళ్లిన వారంతా రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధితో తిరిగి సొంత ఊరికి తిరిగి వచ్చేసారని తెలిపారు. ఒకప్పుడు ఎకర రూ.5 లక్షలు పలికే భూమి విలువ ఇప్పుడు రూ.12 కోట్లకు చేరిందన్నారు. అప్పటికి ఇప్పటికి అభివృద్ధిలో జరిగిన తేడాను గుర్తించి ముంబై నుంచి తిరిగి వచ్చిన వారు అధికార పార్టీలో చేరారని అన్నారు.
మహబూబ్ నగర్ లో ఊహించని అభివృద్ధి: ప్రభుత్వ విప్ బాల్క సుమన్
తెలంగాణ ఏర్పాటుకు ముందు జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా తాను మహబూబ్ నగర్ వచ్చానని… అప్పుడు ఎంతో బోసిపోయి ఉన్న పట్టణం ఇప్పుడు అభివృద్ధితో కలకలలాడుతోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. విశాలమైన రోడ్లు, కెసిఆర్ అర్బన్ ఎకో పార్క్, ట్యాంక్ బండ్, శిల్పారామం, పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తొలి మెడికల్ కళాశాల… ఇలా ఊహించని విధంగా అభివృద్ధి జరిగిందని ఇదంతా మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ వల్లే సాధ్యమైందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణీ దేవి, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు శివరాజ్ తదితరులు హాజరయ్యారు.