అనన్య న్యూస్, మహబూబ్ నగర్: తెలంగాణ రైతాంగ తొలి సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య చూపిన స్ఫూర్తి మనందరికీ ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. గురువారం బిసి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హలులో దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కొమురయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన మహనీయుడు కొమురయ్య అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం మాట వినపడగానే మొట్ట మొదట గుర్తుకొచ్చే వ్యక్తి దొడ్డి కొమురయ్య నేనని పేర్కొన్నారు. భూస్వామ్య పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని పేర్కొన్నారు.
వరంగల్ జిల్లాలో సాధారణ గొర్రెల కాపరుల కుటుంబంలో జన్మించిన కొమురయ్య తెలంగాణ మహోన్నత ఉద్యమానికి ఆధ్యుడయ్యాడని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణ త్యాగం చేసి ఉద్యమానికి ఊపిరి పోశారని వారి ఆశయాలను నేటి తరానికి స్పూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు, బీసీ సంక్షేమ అధికారిణి ఇందిర, షెడ్యూల్డ్ కులాల అభివృద్ది అధికారి పాండు, కలెక్టరేట్ ఏ.ఓ. శంకర్, కురువ సంఘం అధ్యక్షులు నర్సింహులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.