అనన్య న్యూస్, మహబూబ్ నగర్: ఎన్నికల అప్పుడు వచ్చే టూరిస్ట్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి లు పేర్కొన్నారు. ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ డిక్లరేషన్ల పేరిట చేస్తున్నది కేవలం ఎన్నికల స్టంట్లేనని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణలో వచ్చి డిక్లరేషన్ల పేరిట గందరగోళం చేస్తున్నారని ఇక్కడ చేస్తున్న డిక్లరేషన్లు వారు అధికారంలో ఉన్న కర్ణాటకలో ఎందుకు అమల్లో లేవని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణ స్థాయి పథకాలు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేసి ఇక్కడికి వచ్చి డిక్లరేషన్లు అంటే ప్రజలు నమ్ముతారని అన్నారు.

సోమవారం బాలానగర్ మండలం పెద్దాయపల్లిలో రూ. 20 లక్షలతో నిర్మించిన ఎస్టీ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం, రూ. 2 కోట్ల అంచనాతో ఆర్ అండ్ బి రోడ్డు నుండి వనమోనిగూడ వరకు బి.టి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బాలానగర్ మండల కేంద్రంలో రూ.2 కోట్లతో నిర్మించనున్న బంజారా భవన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జడ్చర్ల మండలం మాచవరం వద్ద ఏర్పాటు చేసిన గిరిజన సదస్సులో మాట్లాడాతూ గత 70 ఏళ్లుగా అధికారంలో ఉండి ఇక్కడి ప్రజలకు ఏమాత్రం న్యాయం చేయని పార్టీలు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వచ్చి హడావిడి చేస్తున్నారని, ఎన్నికలప్పుడు వచ్చే టూరిస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
అత్యధిక గిరిజన జనాభా ఉండే ఈ ప్రాంతంలో కనీసం సేవాలాల్ గుడి కట్టాలని, గిరిజన భవన్ కట్టాలనే ఆలోచన కూడా గత పాలకులు చేయలేదని గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో తండాలను తీవ్ర నిర్లక్ష్యం చేశారని తెలంగాణ ఏర్పడిన తర్వాత గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ దని అన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాతే గిరిజన సంక్షేమానికి పెద్ద పీట వేశామని తెలిపారు. గిరిజనులకు అన్ని విధాలా అండగా నిలబడతామని అన్నారు. ఇకపై ముంబై, పుణె వంటి ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పనిలేదన్నారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో గిరిజన భవన్ లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఈ నెల 19న, పాలమూరు ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని ఆరోజున రైతులంతా కలశాలతో ప్రాజెక్టు వద్దకు తరలిరావాలని కృష్ణానీటిని తీసుకుపోయి గ్రామాల్లో చల్లాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే డా. లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.