అనన్య న్యూస్, జడ్చర్ల, డిసెంబర్ 19 : జడ్చర్ల నియోజకవర్గంలో వేలాదిమంది భక్తులు కొలిచే ప్రసిద్ధి చెందిన ఫతేపూర్ మైసమ్మ ఆలయాభివృద్ధికి అటవీ భూమి సమస్య ఆటంకంగా మారిందని, ఆ సమస్యను పరిష్కరించి ఆలయాభివృద్ధికి చేయూత నివ్వాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశంలో అటవీశాఖ గిరిజనుల మధ్య భూ వివాదాలకు సంబంధించిన అంశంపై చర్చ జరిగిన తరుణంలో అనిరుధ్ రెడ్డి ఫతేపూర్ మైసమ్మ ఆలయ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న అటవీ భూమి సమస్యను లేవనెత్తారు.
నవాబుపేట మండల పరిధిలో ఉన్న ఫతేపూర్ మైసమ్మ ఆలయం అప్పన్నపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఉండటంతో ఆలయ ప్రాంగణంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం లేకుండా పోతోందని వాపోయారు. నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకొనే ఈ ఆలయం అభివృద్ధికి ఆటంకంగా ఉన్న అటవీ భూమిని ఆలయానికి ఇచ్చే విషయంగా డీఎఫ్ఓ ప్రతిపాదనలు కూడా పంపారని, ఇక్కడున్న అటవీ భూమికి బదులుగా మరో ప్రాంతంలో 5 ఎకరాల భూమిని అటవీశాఖకు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ కూడా సిద్ధంగా ఉన్నారని అనిరుధ్ రెడ్డి తెలిపారు.
మరో ప్రాంతంలో ప్రభుత్వం కేటాయించే 5 ఎకరాల భూమిని తీసుకొని ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో ఉన్న అటవీభూమిని ఆలయానికి ఇస్తే మైసమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ విషయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బదులిస్తూ, అటవీ భూ వివాదాలు అనేక ప్రాంతాల్లో ఉన్న మాట వాస్తవ మేనని, ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.