అనన్య న్యూస్, మహబూబ్ నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగమంతా సమాయాత్తం కావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర రాజ నర్సింహ, ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రజా పాలనపై బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సముదాయ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో ప్రజా పాలన, ఆరు గ్యారెంటీల అమలుపై మంత్రులు సమీక్ష నిర్వహించారు.
ఆరు గ్యారెంటీల అమలులో చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని, వాటిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు, దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతీ ప్రాంతానికి సంబంధిత శాఖల అధికారులు వెళ్లి ప్రజలకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తులు తీసుకోవాలని దిశానిర్ధేశం చేశారు. మంత్రి దామోదర రాజానర్సింహ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల రూపకల్పన, విధి విధానాలను ప్రభుత్వం రూపొందిస్తే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత అధికారులపై ఉంటుందని, లబ్ధిదారులు ప్రజలే అర్హులైన వారికి ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే సార్థకత చేకూరుతుందన్నారు. అందులో భాగంగానే కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఆరు గ్యారంటీల అమలుకు ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించిందనారు.
మంత్రి జూపల్లి మాట్లాడుతూ యావత్ తెలంగాణ ప్రజలు సంగటితమై కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆరు గ్యారంటీల అమలుకోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన కారక్రమానికి శ్రీకారం చుట్టారని, ఇందులో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్లి దరఖాస్తు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియా, మీడియా, సినిమా థియేటర్లలో ప్రదర్శన, చాటింపు ద్వారా ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పోలీస్ యంత్రాంగం కూడా ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాలోని కొంతమంది అధికారులు తమ పని తీరును మార్చుకోవాలని, ఎలాంటి లోటు పాట్లు లేకుండా విధులు నిర్వర్తించాలని, నిర్లక్ష్య ధోరణిని వీడాలని మంత్రి జూపల్లి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.