అనన్య న్యూస్, నవాబుపేట్: రాష్ట్రంలో పదేళ్లు కొనసాగిన నిరంకుశ పాలనతో ప్రజలు విసిగిపోయి మార్పు కోరుకుంటున్నారని అందుకే కాంగ్రెస్ కు పట్టం కట్టారని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం కొల్లూర్ గ్రామంలో చిన్మయ స్వామి మఠం ముఖ ద్వార ప్రారంభోత్సవానికి ముఖ్య అతిదిగా ఆయన హాజరయ్యారు. శ్రీశైల పీఠాధిపతి జగద్గురు డాక్టర్ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివా చార్య మహాస్వామి, ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, రాజేశ్ రెడ్డిలతో కలిసి ముఖద్వారాన్ని ప్రారంభించారు. అనంతరం మఠంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ధర్మజాగృతి సభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో పదేళ్లు కొనసాగిన నిరంకుశపాలనతో ప్రజలు విసిగిపోయి మార్పు కోరుకున్నారని, ప్రజాస్వామ్య పాలనలో ప్రజలు స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నారని వారికి అనుగుణంగానే కాంగ్రెస్ ప్రజాపాలన అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. తాము అధి కారంలోకి వచ్చి కేవలం 45 రోజులే అయ్యిందని ఇంతలోనే భారాస నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంత వరకు సమంజసమన్నారు. గత ప్రభుత్వం నిజంగా సమస్యలు పరిష్కరించి ఉంటే తాము చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చి ఉండేవి కావన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించామన్నారు. కార్యక్రమంలో మఠం పీఠాధిపతి నందీశ్వర స్వామి, పల్లవి, నాగరాజు, నాయకులు రఘుగుప్త, సుధీర్ రెడ్డి, గోపాల్ గౌడ్, వాసు యాదవ్, రాజు, చంద్రమోహన్, ఖాజామైనోద్దీన్, సేవ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.