అనన్య న్యూస్, మక్తల్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రగతి కోసమే పాలమూరు న్యాయ పాదయాత్ర చేపట్టామని, పాలమూరు ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఉమ్మడి పాలమూరు జిల్లాను ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తామని చల్లా వంశీచందర్ రెడ్డి తెలిపారు. పాలమూరు ప్రగతి కోసం పాలమూరు న్యాయ యాత్ర పేరుతో చల్లా వంశీచందర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను బుధవారం మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండల కేంద్రంలో శ్రీ క్షీరాలింగేశ్వరస్వామి మఠం వద్ద మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి, నారాయణపేట జెడ్పి చైర్ పర్సన్ కే వనజ, డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాదయాత్ర చేపట్టిన వంశీ చందర్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్య వైఖరి పాలనతో పాలమూరు జిల్లాను పదేళ్లుగా రాజకీయాలకు వాడుకొని తమ పబ్బం గడుపుకున్నారే తప్ప అభివృద్ధిలో మాత్రం ఆమడ దూరంలో ఉంచారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రాన్ని పాలించిన గత పాలకులు పాలమూరు జిల్లాను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. రాజకీయ భిక్షను పెట్టిన పాలమూరును నిర్లక్ష్యం చేసి గత పాలకులు తమ సొంత ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నారని అన్నారు. పాలమూరు పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలుపొందిన ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి సహకారంతో పాలమూరును అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని, పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తమ భాద్యత అని అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను స్పూర్తిగా తీసుకొని పాలమూరు న్యాయయాత్ర పేరుతో ఇక్కడి సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. గత పది సంవత్సరాలలో ఈ జిల్లాకు జరిగిన అన్యాయాన్ని నెమరు వేసుకొని అభివృద్ధివైపు నడవాలన్నదే యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు.