అనన్య న్యూస్, కల్వకుర్తి: పట్టణంలోని గిరిజన బాలికల వసతి గృహాన్ని శనివారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వసతి గృహంలో విద్యార్థుల సంఖ్య వారికి అందిస్తున్న మెనుపై ఆరా తీశారు. వసతి గృహంలోని వంటశాలను కూరగాయలు, వంట సరుకులను, బియ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. తాజాగా ఉన్న కూరగాయలను వంటకు ఉపయోగించాలని, కుళ్ళిపోయిన కూరగాయలను, ఇతర పదార్థాలను చెత్తబుట్టలో వేయాలని, వంటశాల, డైనింగ్ హాలు వసతిగృహ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
విద్యార్థులతో మాట్లాడి ఎలాంటి ఆహారం అందిస్తున్నారు ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు డ్రైనేజీ సమస్య ఉందని కలెక్టర్ కు సూచించగా త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని వార్డెన్ కి సూచించారు. విద్యార్థులు బాగా చదివి లక్ష్యాలను చేరుకోవాలని, పాఠశాలకు తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. కలెక్టర్ వెంట కల్వకుర్తి తహశీల్దార్ ఇబ్రహీం, గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.