అనన్య న్యూస్, జడ్చర్ల: మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటలో డాగ్ బంగ్లా (ఐబి) సమీపంలో 44 వ జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవాలయం ఎదురుగా నిరుపయోగంగా ఉన్న రిక్వెస్ట్ బస్టాండ్ ను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని శుక్రవారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు దేవాలయ కమిటీ సభ్యులు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేవాలయం ఎదురుగా రిక్వెస్ట్ బస్టాప్ నిరుపయోగంగా ఉందని, అక్కడే రోడ్డు అండర్ బ్రిడ్జి వేసే క్రమంలో రిక్వెస్ట్ బస్టాప్ వెనకాల మట్టి తీసి రోడ్డు వేయడంతో బస్ స్టాప్ వెనకాల మట్టి లేకపోవడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే కావేరమ్మపేట ప్రజలకు ఈ బస్టాండ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఈ బస్టాండ్ దగ్గరకి ప్రజలు రావడానికి సదుపాయం లేదు, ఎటు ఉపయోగం లేని రిక్వెస్ట్ బస్టాండుని అక్కడి నుంచి పక్కకు కొద్ది దూరంలో ఏర్పాటు చేసేందుకు, తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీని కోరారు. కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకులు పిట్టెల నరేష్, బుక్క నవీన్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహితీ రెడ్డి తదితరులు ఉన్నారు.
