అనన్య న్యూస్, జడ్చర్ల: విద్యార్థినిలకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. బుధవారం జడ్చర్ల పట్టణంలోని తెలంగాణా సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనంలో మాడి పోయిన అన్నం వడ్డించడం గమనించి జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో ఎటువంటి అజాగ్రత్త, నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. వంట గది, స్టోర్ రూం పరిశీలించారు. వంట గది పరిశుభ్రంగా ఉంచు కోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ విద్యార్థినిలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థినిలతో మాట్లాడి ఆహారం, బోధన గురించి తెలుసుకున్నారు.
