మత్తు పదార్థాలు వాడిన, అమ్మిన కఠిన చర్యలు ఎస్పీ హర్షవర్ధన్..
అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గంలో ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి బెల్ట్ షాపులు ఉండొద్దని, గంజాయి, గుట్కా, పాన్ మసాల విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఎస్పీ హర్షవర్ధన్ లు హెచ్చరించారు. జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో ఆదివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో హరిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు బెల్టు షాపులను బందు చేస్తున్నట్లు తెలిపారు. బెల్టు షాపుల నిర్వాహకులంతా ఫిబ్రవరి ఒకటవ తేదీలోగా తమ వద్ద ఉన్న స్టాక్ ను అమ్ముకొని క్లియర్ చేసుకోవాలని సూచించారు.
గ్రామాల్లో దొంగ చాటుగా మద్యం విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గ్రామాలలో మద్యం విక్రయిస్తున్న వారి వివరాలను సమాచారాన్ని అందించాలని, సమాచారాన్ని అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని వారికి పదివేల నజరానా అందిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. మద్యం, గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాలను వాడిన, అమ్మిన కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్పి రాములు, డి.ఎస్.పి మహేష్, జడ్చర్ల సిఐ రమేష్ బాబు, ఎస్ఐలు చంద్రమోహన్, నాగరాజు, సిబ్బంది ఉన్నారు.