అనన్య న్యూస్, జడ్చర్ల: తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులు, నాయకులపై ఎందుకు అంత చిన్న చూపు అని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నుంచి తిరుమల దేవస్థానానికి సిఫార్స్ లేఖలతో వచ్చిన వారికి దర్శనం, రూములు అనుమతించడం లేదని, ఆంధ్రప్రదేశ్ సీఎం తెలంగాణ, ఏపీ తనకు రెండు కళ్ళలాంటివని అని, తెలంగాణ నుంచి ప్రజా ప్రతినిధులు అందించిన సిఫార్సు లేఖలపై వచ్చిన వారికి ఎలాంటి సదుపాయాలు దర్శనం కలిగించడం లేదని, అంటే ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు ఒక కన్నును తీసేసుకున్నారా, లేదా పొడుచుకున్నారా అని ప్రశ్నించారు.
తెలంగాణలో యాదగిరిగుట్ట, భద్రాచలం వంటి దేవస్థానాలకు వచ్చే ఆంధ్ర భక్తులకు అక్కడి ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలను తాము అనుమతించి దర్శనాలు కల్పిస్తున్నామని, కానీ మా సొంత మనుషులు, మా పార్టీ కార్యకర్తలు తిరుమలకు వస్తే కనీసం రూములు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఏపీలో అధికారంలో ఒక ప్రభుత్వము ఉంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వారు హైదరాబాదులో ఆశ్రయం పొందుతారని, ఏపీ వారు హైదరాబాదులో వ్యాపారాలు చేస్తున్నారని అయినా తాము ఏనాడు ఒక్క మాట కూడా అనలేదన్నారు. తిరుమలలో తెలంగాణ వాళ్లను అనుమతించినట్లే, ఏపీ వాళ్ళను మేము ఎమ్మెల్యేలంతా కలిసి రాష్ట్రానికి రావద్దని తీర్మానం చేస్తే ఆ బాధ ఏమిటో మీకు కూడా తెలుస్తుందని ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
తిరుమల దర్శనాలకు తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖల్ని అనుమతించకపోతే, మేము మా అసెంబ్లీ సమావేశాల్లో తాము కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని, ఆ తర్వాత మీరే బాధపడతారని హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం సిఫార్సు లేఖలపై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని, తెలంగాణ ప్రజా ప్రతినిధులు అందించే సిఫార్సు లేఖలపై తెలంగాణ వారికి వసతులు, దర్శనాలు కల్పించాలన్నారు. ఎమ్మెల్యే వెంట ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు ఉన్నారు.