అనన్య న్యూస్, జడ్చర్ల: మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుల వెంకటేష్ డిమాండ్ చేశారు. కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలతకు, స్థానిక కౌన్సిలర్లకు మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని, ఆలోపు కనీస వేతనం 26 వేలు అందించాలని డిమాండ్ చేశారు.
స్థానిక ప్రధాన సమస్య అయిన 2012 నుంచి 2014 వరకు కార్మికుల వేతనాల్లో కట్ చేసిన ఈపీఎఫ్ నిధులను కార్మికుల అకౌంట్లో జమ చేయాలని అన్నారు. కార్మికుల ఈఎస్ఐ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ను, కంప్యూటర్ ఆపరేటర్ను నియమించాలని కమిషనర్ ను కోరారు. కార్మికులకు వివిధ కేటగిరీల వారీగా వేతనాలను ఇవ్వాలని, కార్మికులకు పండుగ సెలవులను, వారాంతపు సెలవులను సర్కులర్ ప్రకారం అమలు చేయాలని, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కృష్ణ, శంకర్, అలివేల, శ్రీను, అరుణ, ఆంజనేయులు, విద్యాసాగర్, కేశవులు, గణేష్ తదితరులు ఉన్నారు.