అనన్య న్యూస్, జడ్చర్ల: ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రజా దర్బార్ ముఖ్య లక్ష్యం అని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజాదర్బార్ లో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తమ ఫిర్యాదులను ఎమ్మెల్యేకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. జడ్చర్ల 100 పడకల ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ తో తెలుపడంతో మంత్రి స్పందించి సమస్యను తొందరలోనే పరిష్కరిస్తామని తెలియజేశారని అన్నారు.
రాజాపూర్, బాలానగర్ మండల కేంద్రాలలో 44వ జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడడం జరిగిందని ఫ్లైఓవర్ల ఏర్పాటుకు వినతులు అందించాలని, ఫ్లైఓవర్ల ఏర్పాటుకు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి సాంక్షన్ అయ్యే విధంగా కృషి చేస్తానని ముఖ్యమంత్రి తెలిపారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పది కోట్ల రూపాయలు అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారని, ఆ డబ్బులతో నియోజకవర్గంలో పలు గ్రామాలలో ఉన్న సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు.