అనన్య న్యూస్, జడ్చర్ల: ముగ్గుల పోటీలు సంస్కృతికి సాంప్రదాయాలకు ప్రతీకలని కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగ, స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని గురువారం 24వ వార్డులో కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాలూకా క్లబ్ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పోటీలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీలో గొలుపెందిన విజేతలకు పాల్గొన్న మహిళలందరికీ బహుమతులను ప్రధానం చేశారు. ప్రథమ బహుమతి చంద్రకళ కు రూ.5116, ద్వితీయ బహుమతి విజయలక్ష్మి కి 3116 రూపాయలను అందజేశారు.
కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఉదయం పూట ఇళ్ళ ముందు ముగ్గులు వేయడం మంచి వ్యాయామమన్నారు. దీంతో పాటు మహిళల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. ముగ్గుల పోటీలు ఐక్యతకు, ఆప్యాయతకు నిదర్శనమన్నారు. న్యాయ నిర్ణీతలుగా జాతీయ సాహిత్య పరిషత్ జడ్చర్ల శాఖ అధ్యక్షులు పద్మ లీల, బాలమణి, విజయలక్ష్మి విజేతలను నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో నరసింహారావు, సాయన్న, కనకప్ప, శ్రీనివాస్ యాదవ్, సత్యనారాయణ, ప్రశాంత్, గోవర్ధన్, కిరణ్, కర్ణాకర్, రాఘవేందర్, రాధాకృష్ణ, వార్డు మహిళలు పాల్గొన్నారు.