- జడ్చర్ల నియోజకవర్గంలో రూ.133 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శంఖు స్థాపన..
- పరిశ్రమల స్థాపన, నిరుద్యోగుల నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధికల్పన..
- వెనుకబడిన మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలను అభివృద్ధి చేస్తాం..
- పాలమూరు యూనివర్శిటీ లో ఉద్యోగాల భర్తీ, వైస్ చాన్సలర్ కూడా త్వరలో నియామకం..
- జడ్చర్ల పర్యటనలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
అనన్య న్యూస్, జడ్చర్ల: జీఓలు ఇవ్వడమే కాదు.. టెండర్లు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తూ శంకుస్థాపనలు చేయడమే ప్రభుత్వ విధానమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. జడ్చర్ల నియోజకవర్గంలో సోమవారం రూ.133 కోట్లతో డబుల్ రోడ్డు పనుల శంకుస్థాపనకు వచ్చిన ఆయన జడ్చర్ల పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. జడ్చర్లలో పనులను కూడా మిషన్లు దించిన తర్వాతనే ప్రారంబించామని తెలిపారు.133 కోట్ల రూ. లకు అదనంగా 20 కోట్ల రూ.లతో 153 కోట్ల రూ.లతో టెండర్ లు పూర్తి చేసి శంఖు స్థాపన తో పనులు ప్రారభించి నట్లు తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గంలో రూ. 150 కోట్లతో చేపట్టబోయే పనులకు కూడా అదే విధానం అమలు చేస్తామన్నారు.
వెనుకబాటులో ఉన్న పాలమూరు- నల్గొండ జిల్లాలను అభివృద్ధి చేసేందుకు సీ.ఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కృషిచేస్తున్నామని అన్నారు. రీజనల్ రింగ్ డ్డుకు 30 కిలోమీటర్ల దూరంలోనే జడ్చర్ల ఉందని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. మహబూబ్నగర్, భూత్పూరు, జడ్చర్ల బైపాస్ ద్వారా ట్రై సిటీలుగా మారతాయని ఉన్నారు. పాలమూరు యూనివర్శిటీ లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని, త్వరలో వీసీ నియామకం పూర్తవుతుందని అన్నారు. హైదరాబాద్- బెంగుళూరు హైవేను గ్రీన్ ఫీల్డ్ గా మార్చి 12 లైన్లుగా విస్తరించబోతున్నామని, దీనికి సంబందించిన డీపీఆర్ కూడా రెడీ అవుతోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదట సొంత జిల్లాలో సమీక్ష నిర్వహించారన్నారు.
త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ. 5 లక్షలు ఇచ్చి పేదల సొంత ఇంటి కలను నెరవేరుస్తుందని తెలిపారు పదేళ్ల లో గత ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఆలోచన చేయలేదని, కానీ ఇటీవల స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. వివిధ కోర్సులు చేసిన విద్యార్థులకు వృతిపరంగా మెలకువలను నేర్పించడమే లక్ష్యంగా ఈ సెంటర్లు పనిచేస్తాయని తెలిపాడు ఇక్కడ పని ఉన్నా, సరైన స్కిల్ లేకపోవడం వల్ల బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ నుంచి చాలామంది వస్తున్నారని, భవిష్యత్లో ఇక్కడి వారికి ఉపాధి కల్పన తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం పకడ్బందీగా పరీక్షల నిర్వహణ కు ప్లాన్ చేస్తుంటే అడ్డు కునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని అన్నారు.ఇప్పటికే కోర్టు వివాదాలను పరిష్కరించి, 30వేల ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో 6 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ వస్తుందన్నారు. అసెంబ్లీలో జాబ్ కేలండర్ ను ప్రకటిస్తామన్నారు.
త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రారంభవుతుందని. దానికి చేరువలో ఉన్న పాలమూరు జిల్లా అభివృద్ధి చెందుతుందని అన్నారు. గత ప్రభుత్వం పాలమూరు రంగా రెడ్డి పూర్తి చేయలేదని, మూడేళ్లలో పాలమూరు రంగారెడ్డి పూర్తిచేసి ఉంటే ఇప్పటికే మూడు జిల్లాలు కళకళలాడుతుండేవని తెలిపారు. మహబూబ్ నగర్ లో స్కిల్ డెవలప్ మెంట్
సెంటర్ కు రూ. 10 కోట్లు ఇచ్చామని, అవసరమైతే మరో రూ. 10 కోట్లు ఇస్తామన్నరు.
జడ్చర్ల ఆసుపత్రిలో నిబ్బంది నియామకం,మౌలిక వసతులు కల్పించడం కోసం ఆరోగ్య శాఖ కమిషనర్ కర్ణన్ తో ఫోన్ లో మాట్లాడి నట్లు 15 రోజుల్లో డాక్టర్లు, సిబ్బంది నియామకం చేస్తారని అన్నారు. ఈ సమావేశంలో శాసన సభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి, యెన్నం శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీ హరి, జి.మధుసూధన్ రెడ్డి, మైనార్టీ కమిషన్ ఛైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు.