- నిజమైన పేదలకు న్యాయం చేయండి..
- పార్టీలు కాదు అర్హతలు చూసి జాబితాలో చేర్చండి..
- మంజూరులో ఎక్కడా అవినీతి జరగకుండా చూడండి..
- అధికారులు, ఇందిరమ్మ కమిటీలకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సూచన..
అనన్య న్యూస్, జడ్చర్ల: రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ప్రభుత్వం పెట్టిన నిబంధనలను కాకుండా, ప్రజల పరిస్థితులను చూసి నిర్ణయం తీసుకోవాలని అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికల సమయంలో ఇళ్లు, రేషన్ కార్డుల విషయంలో హామీలను ఇచ్చి మోసం చేసారని, అయితే తమ ప్రభుత్వం గ్రామ సభలు పెట్టి ఎవరికి ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకొనే అధికారాన్ని ప్రజలకే అప్పగించిందని ఆయన పేర్కొన్నారు.
బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి, గుండేడ్, రాజాపూర్ మండలంలోని కుతినేపల్లి, బోడగుట్ట తాండా, చెన్నవెల్లి, రంగారెడ్డి గూడ, నవాబుపేట మండలంలోని రేకుల చౌడాపూర్, ఊరంచుతాండా గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొని ప్రసంగించారు. ఇదివరకు వచ్చిన జాబితాల్లో పేర్లు ఉన్నవారికి మాత్రమే ఇళ్లు, రేషన్ కార్డులు వస్తాయని కొంత మంది చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని అనిరుధ్ రెడ్డి చెప్పారు. అయితే అర్హత ఉండి కూడా ఇళ్లు, రేషన్ కార్డులు రాని వారి పేర్లను జాబితాలో చేర్చేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అధికారులు రూపొందించిన జాబితాల్లో తమ పేర్లు లేవని ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదన్నారు. అర్హత కలిగిన వారందరి పేర్లను గ్రామ సభ ద్వారా జాబితాలోకి చేర్చిన తర్వాత గ్రామ సభ ఆమోదంతో ఆ జాబితాలను జిల్లా కలెక్టర్ కు, ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని తెలిపారు.
గ్రామ సభ ఆమోదించిన జాబితాలను పంచాయితీ కార్యాలయాలలో అందుబాటులో పెడతామన్నారు. గ్రామ సభ జరిగిన సమయంలో అర్హత కలిగిన గ్రామస్తులు ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్లి గైర్హాజర్ అయితే అలాంటి వారి పేర్లను కూడా జాబితాలో వచ్చేలా ఇందిరమ్మ కమిటీ సభ్యులు చూసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో బూటకపు జాబితాలను తీసుకొచ్చి వాటిని చూపించి ఓట్లు వేయమని అడిగేవారని, ఎన్నికల తర్వాత ఆ హామీలను తుంగలో తొక్కేవారని విమర్శించారు. అయితే తమ ప్రభుత్వం గ్రామ సభలు పెట్టి మరీ ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తోందన్నారు. ఇళ్లు, రేషన్ కార్డుల మంజూరులో పార్టీలను చూడకూడదని, కేవలం పేదరికాన్ని మాత్రమే చూడాలని హితవు చెప్పారు.
ఇందిరమ్మ కమిటీ సభ్యులు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వారి ఇళ్ల పరిస్థితులను పరిశీలించి అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి సాయం చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఇళ్లు కూలిపోయిన వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాత రేకుల ఇళ్లలో ఉన్న వారికి మంజూరు చేయాలని అనిరుధ్ రెడ్డి సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదివేలు ఇస్తే మీ పేరు రాస్తామనే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అలా జరగదన్నారు. ఎక్కడైనా అలాంటి అవినీతి జరిగిందని తన దృష్టికి వస్తే మాత్రం తాను కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికి కూడా ఒక్క రుపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదని స్పష్టం చేసారు. అధికారులు కూడా నిబంధనలను మాత్రమే చూడకుండా గ్రామాలలో ఉండే ప్రజల పరిస్థితులను చూసి నిర్ణయాలు తీసుకోవాలని, నిజమైన పేదలకు న్యాయం చేయాలని కోరారు. అర్హత కలిగిన వారందరికీ రేషన్ కార్డులు వచ్చేలా చూడాలన్నారు. గ్రామస్తులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూడా అధికారులకు సహకరించాలని అనిరుధ్ రెడ్డి కోరారు.