అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గంలోని పంచాయితీరాజ్ శాఖకు చెందిన 7 రోడ్లను బీటీ రోడ్లుగా మార్చేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మట్టి, కంకర రోడ్లుగా ఉన్న రోడ్లను ఈ నిధులతో తారు రోడ్లుగా మార్చనున్నామని గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో కొత్తగా బీటీ రోడ్డు నిర్మాణాలు మంజూరైన రోడ్ల వివరాలను ఎమ్మెల్యే వివరించారు. నిధులు మంజూరైన ఈ 7 రోడ్లలో రెండు రోడ్లు బాలానగర్ మండలంలో ఉండగా మిగిలిన రోడ్లు నియోజకవర్గంలోని ఇతర మండలాల్లో ఉన్నాయని చెప్పారు.
నవాబుపేట మండల పరిధిలో కొల్లూరు ఆర్అండ్ బీ రోడ్డు నుంచి మండల శివార్లలోని దేపల్లి వరకు ఉన్న 5 కి.మీ. రోడ్డు నిర్మాణానికి రూ.4.15 కోట్లు మంజూరు కాగా, బాలానగర్ మండల పరిధిలోని మోతీఘనపూర్ నుంచి రాయికల్ వరకూ ఉన్న 3 కి.మీ.రోడ్డు నిర్మాణానికి రూ.2.40 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. గంగాధరపల్లి నుంచి రామేశ్వరం దేవాలయం వరకూ ఉన్న 2 కి.మీ.రోడ్డు నిర్మాణానికి రూ.1.55 కోట్లు మంజూరు అయ్యాయని అన్నారు. జడ్చర్ల మండలంలోని కిష్టారం నుంచి అంబట్ పూర్ వెళ్లే 2 కి.మీ.రోడ్డుకు రూ.1.55 కోట్లు మంజూరు కాగా రాజాపూర్ మండంలోని మైమస్మ కుంట నుంచి కేశ్యానాయక్ తాండాకు వెళ్లే 1.20కి.మీ.రోడ్డుకు రూ.90 లక్షలు మంజూరు అయ్యాయని చెప్పారు.
ఉర్కొండ మండలంలోని రాచానపల్లి నుంచి మాదారం వెళ్లే 3 కి.మీ.రోడ్డుకు రూ.2 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. మిడ్జిల్ మంలం సింగందొడ్డి నుంచి లక్యాతాండా మీదుగా నాయకుని తాండా వరకూ ఉన్న 3 కి.మీ.రోడ్డు నిర్మాణానికి రూ.2.45 కోట్లు మంజూరు చేయించానని వివరించారు. ఈ 15 కోట్ల రుపాయల నిధులతో నియోజకవర్గంలో 19.20 కి.మీ.రోడ్లు బాగుపడనున్నాయని పేర్కొన్నారు.