- అన్నదాత గంట మోహన్ రెడ్డి..
అనన్య న్యూస్, జడ్చర్ల: మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో (జాతర) భాగంగా శుక్రవారం స్వామివారి కళ్యాణం శోభాయమానంగా నిర్వహించారు. ముందుగా వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణం చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగింపుగా కళ్యాణ వేదిక పైకి తీసుకవచ్చి వేద పండితుల మంత్రోచ్ఛారణ, భక్తుల గోవింద నామస్మరణతో కళ్యాణం వైభవంగా జరిపించారు. కల్యాణోత్సవం తిలకించేందుకు మహిళా భక్తులు తరలిరావడంతో ఆలయం ప్రాంగణం సందడిగా నెలకొంది, కానీ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం భక్తుల రాక తక్కువగా ఉందని, ఆలయ సిబ్బంది ప్రచార లోపంతో భక్తుల రద్దీ తగ్గిందని భక్తులు చర్చించుకుంటున్నారు. కళ్యాణ అనంతరం భక్తులు ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
అన్నదాత గంట మోహన్ రెడ్డి..
జడ్చర్ల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి నిర్వహించే కళ్యాణోత్సవంలో గత 28 సంవత్సరాలుగా జడ్చర్ల పట్టణానికి చెందిన గంటా మోహన్ రెడ్డి దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఫిబ్రవరి 24 శనివారం రాత్రికి రథోత్సవము (పెద్ద తేరు) ను లాగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.