అనన్య న్యూస్, జడ్చర్ల: గీత కార్మికుల నుండి లంచం తీసుకుంటూ ఏసీబీకి జడ్చర్ల ఎక్సైజ్ సీఐ బాలాజీ పట్టుబడ్డాడు. టిఎఫ్టి లైసెన్స్ జారీ విషయంలో రూ. 65 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డట్టు సమాచారం. ఏసీబీ డీఎస్పీ సమాచారం మేరకు భూత్పూర్ మండలం పోతులమడుగు గ్రామానికి చెందిన ముగ్గురు గీత కార్మికులు టి ఎఫ్ టి లైసెన్సుల జారీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎక్సైజ్ సీఐ రూ .90 వేలను గీత కార్మికుల నుండి డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఇందుకుగాను ఇప్పటికే రూ. 25 వేలను ముందుగా ఇచ్చినట్లు సమాచారం.
సోమవారం మిగతా డబ్బులు చెల్లించే సమయంలో గీత కార్మికులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్క వ్యూహం ప్రకారం సాయంత్రం గీత కార్మికులు ముగ్గురు జడ్చర్ల ఎక్సైజ్ సిఐ కార్యాలయానికి వెళ్లి రూ. 65 వేలను చెల్లించారు. ముందస్తు వ్యూహం ప్రకారం ఏసీబీ అధికారులు ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లి సిఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు పలు ఫైళ్లను తనిఖీలు చేపడుతున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏసీబీ డిఎస్పీ శ్రీకృష్ణగౌడ్ మాట్లాడుతూ అవినీతికి పాల్పడిన సీఐ బాలాజిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఏసీబీ సీఐలు లింగుస్వామి, జలాల్, పది మంది సిబ్బంది పాల్గొన్నారు.