అనన్య న్యూస్, జడ్చర్ల: విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మారేపల్లి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం జడ్చర్ల మండలం కోడుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవమును ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 45 మంది విద్యార్థులు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు.
ప్రధానోపాధ్యాయురాలుగా 10వ తరగతికి చెందిన సరిత, కలెక్టర్ గా సిద్దు, అదనపు కలెక్టర్ గా శిరీన్, జాయింట్ కలెక్టర్ గా సాధియా, డీఈవోగా అభిలాష్ రెడ్డి, ఎంఈఓ గా ఇందు ప్రియ, ఏ ఎం ఓ గా నాగవైశాలి, ఆర్జెడి గా వైష్ణవి, డిప్యూటీ డిఓ గా అరుణ్ వ్యవహరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొని వారి స్వయం పరిపాలన దినోత్సవమును స్వీయ అనుభవంతో అనుభూతి చెందడంతో ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు.