అనన్య న్యూస్, జడ్చర్ల: ఊర్కొండ మండలంలో రూ.100 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టనున్నామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. ఊర్కొండకు ఇప్పటికే ఇండోర్ స్టేడియం మంజూరు కాగా ఆర్ అండ్ బి, పంచాయితీ రాజ్ తదితర విభాగాల నుంచి దాదాపు రూ.100 కోట్లు మంజూరు కానున్నాయని ప్రకటించారు. ఊర్కొండను ఇతర మండలాలతో సమానంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఊర్కొండ మండలం ఇప్పలపాడ్ గ్రామంలో మంగళవారం ఆయన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లల పంపిణీని ప్రారంభించి అనంతరం ఏర్పాటైన సభలో ప్రసంగించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఊర్కొండ నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి నోచుకోలేకపోయిందని అనిరుధ్ రెడ్డి చెప్పారు. అయితే ఈ మండల అభివృద్ధికి తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని, అవసరమైన నిధులను తీసుకొచ్చి ఊర్కొండ మండలాన్ని జడ్చర్ల నియోజకవర్గంలోని ఇతర మండలాలతో సమానంగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. జకినాలపల్లిలో చెరువు నిర్మాణం చేయాలని ప్రజలు కోరగా తాను చెరువు నిర్మాణాన్ని, నిధులను మంజూరు చేయించానని, ప్రస్తుతం దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. పంచాయితీ రాజ్ శాఖ ద్వారా రూ.5 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయని అన్నారు.
ఊర్కొండ కు ప్రస్తుతం ఇండోర్ స్టేడియం కూడా మంజూరైయిందని వెల్లడించారు.ఇది కాకుండా మండలంలోని రోడ్ల నిర్మాణాల కోసం ఆర్ అండ్ బి ద్వారా రూ.60 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు సమర్పించామని, ఈ నిధులు మార్చి నెల నాటికి మంజూరు అవుతాయని చెప్పారు. అలాగే ఊర్కొండలో ఎమ్మార్వో, ఎంపీడీఓ కార్యాలయాలకు భవనాలు లేవని ప్రస్తావించారు. వీటి కోసం రూ.16 కోట్లతో ఇంటి గ్రెటెడ్ భవన నిర్మాణాన్ని ప్రతిపాదించామన్నారు. ఇంటిగ్రెటెడ్ భవన నిర్మాణం మంజూరు కాకపోయిన ఈ రెండు కార్యాలయాలకు వేర్వేరుగా భవనాల నిర్మాణానికి రూ.5 కోట్ల చొప్పున నిధులు మంజూరు అవుతాయని వివరించారు.
గత పదేళ్ల కాలంలో అప్పటి ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని పట్టించుకోని కారణంగా ఆర్థిక స్థోమత సహకరించకపోయినా ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. వాస్తవానికి ప్రైవేటు పాఠశాలల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని అభిప్రాయపడ్డారు. అయితే సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడమే ప్రభుత్వ పాఠశాలలకు శాపంగామారిందన్నారు. అయితే తాను జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఏ అవసరాలు ఉన్నాయో తెలపాలని కోరానని, అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయల అభివృద్ధికి రూ.18 కోట్ల వరకూ అవసరమౌతాయని ప్రాథమికంగా అంచనా వేసారని అనిరుధ్ రెడ్డి తెలిపారు.
ఈ నిధులను తాను ప్రభుత్వం నుంచి తీసుకొస్తానని, మరికొంత నిధులను పరిశ్రమలకు సంబంధించిన సీఎస్ఆర్ ద్వారా తీసుకొస్తానని, ఇంకా అవసరమైతే తాను సొంత నిధులను కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల అవసరాలన్నీ తీరేలా చూస్తానని, విద్యార్థులకు మంచి చదువులు అందేలా చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. కాగా ఇప్పపాడ్, జకినాలపల్లి, బొమ్మరాజుపల్లి, జగబోయిన్ పల్లి, రాంరెడ్డిపల్లి, ముచ్చర్లపల్లి, ఊర్కొండ, ఊర్కొండ పేట్, రాచాలపల్లి, మాధారం, గుడిగానిపల్లి, రేవల్లి, తిమ్మన్నపల్లి గ్రామాల్లో అనిరుధ్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు షూలను పంపిణీ చేసారు.