అనన్య న్యూస్, జడ్చర్ల: రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తొమ్మిదేళ్ల కాలంలో రైతులకు బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తే అది జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలే సరిపోతుందని మాట్లాడటం సిగ్గుచేటని, రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన కాంగ్రెస్ రైతులకు చేసిందేమీ లేదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగ అన్నదాన్ని సీఎం కేసిఆర్ ప్రభుత్వంలో పండగల మార్చారన్నారు.
బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు ఉచిత విద్యుత్తు అందించడం జరుగుతుందని, అది నచ్చని కాంగ్రెస్ ఉచిత విద్యుత్ ను ఎత్తివేయాలన్న దురుద్దేశంతో కుట్రలో భాగమే రేవంత్ రెడ్డి తన నోటి దురుసు వ్యాఖ్యలతో రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందని అనడం, కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని ముందుగానే బయట పెట్టారని తెలిపారు. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఎన్ని ఎత్తులు వేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం అసాధ్యమని అన్నారు.
కాంగ్రెస్ హయాంలో కరెంటు కష్టాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు స్వయంగా అనుభవించారని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కష్టాలు శాశ్వతంగా దూరం చేశామని, దేశానికే అన్నం పెట్టే రైతన్నలకు అన్యాయం చేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, పిఎసిఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్, రైతుబంధు అధ్యక్షులు జంగయ్య, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రనిల్ చందర్, నాయకులు పిట్టల మురళి తదితరులు పాల్గొన్నారు.