అనన్య న్యూస్, జడ్చర్ల: పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీని సత్వరమే ఈనెల 6వ తేదీ లోపల అందించాలని లేనిపక్షంలో మూకుమ్మడిగా తమ పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉదండాపూర్ గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రభుత్వాని హెచ్చరించారు.
ఈ సందర్భంగా మంగళవారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఇన్స్ పెక్షన్ బంగ్లా వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉదండాపూర్ గ్రామ ఉప సర్పంచ్ శేఖర్, వార్డు సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఉదండాపూర్ లోని 1100 కుటుంబాలు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు కొరకై ఉదండాపూర్ గ్రామానికి మేము మా భూములు, ఇండ్లను ప్రభుత్వానికి అప్పగించామని, ప్రభుత్వం మా ఆస్తులను స్వాధీన పరుచుకొని మూడు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ గానీ ఇండ్ల ప్లాట్లు గాని ఇప్పటివరకు అందించలేదని, ఈ విషయంపై అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన కాలయాపన చేస్తూ వచ్చారని దీంతో గ్రామంలోని 1100 కుటుంబాలు గ్రామంలో మౌలిక వసతులు, రోడ్డు సౌకర్యం, ఉపాధి కోల్పోయి జీవనం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తమ నుంచి ఆస్తులను స్వాధీన పరుచుకున్న సమయంలో మూడు నెలల్లో తమ ప్యాకేజీని ఇవ్వడంతో పాటు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ఈనెల 6వ తేదీ రోజు ఉదండాపూర్ నిర్వాసితులకు ఇవ్వాల్సిన ప్యాకేజీ, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని లేని పక్షంలో అదే రోజు గ్రామంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు, పార్టీకి రాజీనామా చేయడంతో పాటు గ్రామంలోని 500 మంది ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, భూనిర్వాసితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమానికి కార్యచరణ రచించి మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉదండాపూర్ వార్డు సభ్యులు నర్సమ్మ, నీలమ్మ, యాదమ్మ, రాజు, స్వప్న, రాములు, అఫ్జల్, సత్యమ్మ తదితరులు ఉన్నారు.