అనన్య న్యూస్, జడ్చర్ల: గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా రాష్ట్రంలోని బీసీలకు బీసీ బందు పథకం ప్రవేశపెట్టి ఒక్కొక్క కుటుంబానికి 100 శాతం రాయితీతో రూ.10 లక్షలు మంజూరు చేయాలని బిసి సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ అన్నారు. ఈ మేరకు శనివారం జడ్చర్ల తహసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ తిరుపతయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీలకు బీసీ బందు అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందని హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు.
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బీసీ కులవృత్తులకు ప్రకటించిన లక్ష రూపాయల పథకాన్ని బీసీలలోని 130 కులాలకు వర్తింపజేసి పథకాన్ని అమలు చేయాలని, బీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్ ద్వారా రాయితీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అందరికీ రాయితీరణాలు ఇచ్చి బీసీల సమగ్ర అభివృద్ధికి పాటుపడాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనియెడల బీసీ సేన తరపున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొల్లెమోని నిరంజన్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి లింగం పేట్ శేఖర్, కార్మికవిభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సురభి విజయ్ కుమార్, జిల్లా నాయకులు గోపాల్, కార్మిక విభాగం మండల అధ్యక్షులు ఆకుల చంద్రమౌళి, మండల కార్యదర్శి సురబీ రఘు, కట్టమురళి, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరామ్, రమేష్, ఆంజనేయులు, ఆలూర్ నర్సిములు, రంగప్ప, నర్సిములు తదితరులు ఉన్నారు.