- కులవృత్తులకు సర్కారు రూ.లక్ష ఆర్థిక సాయం..
అనన్య న్యూస్, జడ్చర్ల: పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరారు. కుల వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఎవరు చేయని సాయం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రూ. లక్ష ఆర్థిక సాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే అన్నారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కులవృత్తుల ఆర్థిక అభివృద్ధిలో భాగంగా మంగళవారం జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా 300 మంది లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ తో కలిసి రూ. లక్ష ఆర్థిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బీసీ కులవృత్తులను పట్టించుకోలేదన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండ నేరుగా లబ్ధిదారుని పేరుపై లక్ష రూపాయలు అందచేస్తున్నామని, బీసీ కుల వృత్తి దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. బీసీ కుల వృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం పంపిణీ నిరంతర ప్రక్రియని, ప్రతినెలా 300 మందికి సాయ మందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
త్వరలోనే క్రిస్టియన్, మైనార్టీ వర్గాలకు కూడా ఆర్థిక సాయం పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందినవారు గ్రామాల్లో చర్చ జరపాలని, పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలవాలని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, జిసిసి చైర్మన్ వాల్యా నాయక్, పిఎసిఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్, రాజాపూర్ మండల నాయకులు అభిమన్యు రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు, మూడా డైరెక్టర్లు, నాయకులు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.