అనన్య న్యూస్, జడ్చర్ల: వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు సాధించి అధికారంలోకి వస్తామని టిపిసిసి ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. గురువారం ఆయన జడ్చర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన గ్యారెంటీ స్కీంలు ప్రజల్లో గుణాత్మకమైన మార్పును తీసుకవచ్చాయని, కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ బహిరంగ సభలో ప్రకటించిన గ్యారెంటీ పథకాలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని, ఇప్పటికే రైతు, దళిత, యూత్ డిక్లరేషన్లు ప్రకటించామని, త్వరలోనే బీసీ, మైనార్టీ డిక్లరేషన్లు చేరుస్తామన్నారు. తమ మేనిఫెస్టోను ప్రతి గడపకు తీసుకెళ్తామని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంతకాలతో కూడిన గ్యారెంటీ కార్డులను ప్రతి ఇంటికీ ఇస్తామన్నారు. తాము ప్రకటించిన గ్యారంటీ స్కీంలు అమలు కాకుంటే తమ ప్రభుత్వాన్ని నిలదీయవచ్చన్నారు.
జడ్చర్ల నుంచి నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యరిగా టీపీసీసీ సెక్రటరీ అనిరుథ్ రెడ్డి పోటీ చేస్తారని మల్లురవి స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ మరో నియోజకవర్గం నుంచి అవకాశం కల్పిస్తామని, తాను పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. తాను ఇప్పటికే నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేశానని, మరోసారి అక్కడి నుంచే పోటీ చేస్తానని తెలిపారు. సమావేశం లో నాయకులు నిత్యానందం, వెంకటయ్య, మినహాజ్, వెంకటేశం, ప్రవీణ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.